Page Loader
Andhra Pradesh: పాత లేఅవుట్లకు అనుమతుల పునరుద్ధరణ.. 85 వేల కుటుంబాలకు ఊరట
పాత లేఅవుట్లకు అనుమతుల పునరుద్ధరణ.. 85 వేల కుటుంబాలకు ఊరట

Andhra Pradesh: పాత లేఅవుట్లకు అనుమతుల పునరుద్ధరణ.. 85 వేల కుటుంబాలకు ఊరట

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వల్ల 85 వేల కుటుంబాలకు ఊరట లభించనుంది. అప్పు చేసి ఇంటి స్థలాలను (లేఅవుట్లలో ప్లాట్లు) కొనుగోలు చేసిన వారు ఇన్నాళ్లూ అనుమతులు రాక, రుణాలు దొరకక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇప్పుడు వారి సమస్యలు పరిష్కారం కానున్నాయి. 15 నుంచి 20 ఏళ్ల క్రితం వివిధ పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు పొందిన 870 లేఅవుట్లకు, గడువు లోపు పనులు పూర్తి చేయకపోయినప్పటికీ, ఇప్పుడు అనుమతులను తిరిగి పునరుద్ధరించనున్నారు. ఈ లేఅవుట్లలో 624 లేఅవుట్లు రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) పరిధిలో ఉండగా, 182 లేఅవుట్లు వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. మిగిలినవి తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో గుర్తించారు.

Details

అనుమతులు తీసుకున్నా అభివృద్ధి కాలేదు 

లేఅవుట్ల అభివృద్ధికి పట్టణాభివృద్ధి సంస్థల అనుమతులు తీసుకున్నా, నిబంధనల ప్రకారం మూడేళ్లలోగా రోడ్లు, కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవాల్సి ఉంది. అప్పుడు మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలు తనఖా(మార్ట్‌గేజ్‌) పెట్టిన ప్లాట్లను విడుదల చేస్తాయి. కానీ 8,509 ఎకరాల్లో రూపొందించిన 870 లేఅవుట్లలో నిర్దేశిత పనులు పూర్తి కాలేదు. ఈ లేఅవుట్లలో సుమారు 85 వేల ప్లాట్లు ఉన్నాయి. వీటిలో చాలా ప్లాట్లు ఇప్పటికే విక్రయమయ్యాయి. అనుమతుల గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఫీజులు కట్టి అనుమతులను పునరుద్ధరించుకునే అవకాశం ఉన్నా, పెరిగిన ఫీజులు, మళ్లీ చెల్లించాల్సిన డెవలప్‌మెంట్ ఫీజుల భారం వల్ల వ్యాపారులు వెనక్కి తగ్గారు. దీంతో ప్లాట్ కొనుగోలు చేసిన ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

Details

ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరవ్వలేదు 

లేఅవుట్ల అనుమతులు పునరుద్ధరించుకోని కారణంగా, పట్టణ ప్రణాళిక విభాగం ఆ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదు. ఫలితంగా గత 12 ఏళ్లలో దాదాపు 10 వేల దరఖాస్తులు తిరస్కరించారు. అలాగే ఎల్‌పీ నంబర్ లేకపోవడం వల్ల బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేయలేదు. కొనుగోలుదారుల అవస్థలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం 'వన్‌టైమ్ సెటిల్‌మెంట్' పద్ధతిలో అనుమతులను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పించింది. డెవలప్‌మెంట్ ఛార్జీలు మినహాయిస్తూ అనుమతుల పునరుద్ధరణను సులభతరం చేసింది. ప్రస్తుతం పట్టణాభివృద్ధి సంస్థలు వ్యాపారులకు నోటీసులు పంపిస్తూ, ఈ అవకాశాన్ని వినియోగించుకుని అనుమతులను పునరుద్ధరించుకోవాలని సూచిస్తున్నాయి.