
Cash row case: కమిటీ ముందుకు ఎందుకు వెళ్లారు?: జస్టిస్ వర్మను ప్రశ్నించిన సుప్రీం కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లో భారీగా నగదు కట్టలు వెలుగులోకి వచ్చిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏర్పాటైన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ సమర్పించిన నివేదికను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "ఈ పిటిషన్‌ను ఈ తరహాలో దాఖలు చేయాల్సిన అవసరం ఏమి ఉండదేమో.మీరు త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తును సవాల్ చేసినందున ఈ కేసులో తొలి ప్రతివాది సుప్రీంకోర్టే అవుతుంది.ఆ కమిటీ నియమించబడ్డప్పుడు మీరు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించలేదేంటి?ఎందుకు ఆగిపోయారు? గతంలో ఇలాంటి విచారణలకు న్యాయమూర్తులు హాజరుకాలేదు.అయితే మీరు ఎందుకు హాజరయ్యారు?" అని ధర్మాసనం ప్రశ్నించింది.
వివరాలు
జస్టిస్ వర్మ ఇంటి ఆవరణలో దొరికిన నగదు
దీనికి సమాధానంగా జస్టిస్ వర్మ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ, "ఆ నగదు ఎవరిది అనే విషయం స్పష్టతకు రావాలని భావించడంతోనే ఆయన విచారణకు హాజరయ్యారు" అని తెలిపారు. జస్టిస్ వర్మ ఇంటి ఆవరణలో దొరికిన నగదు ఆయనదే అని ఎలా నిర్ధారించగలమని సిబల్ ప్రశ్నించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, "అప్పుడు అక్కడ పోలీసులు, సిబ్బంది ఉన్న సమయంలోనే ఆ నగదు బయటపడింది కదా" అని పేర్కొంది. దీనిపై సిబల్ స్పందిస్తూ, "అప్పటికి హైకోర్టు న్యాయమూర్తి సిబ్బంది ఆ ప్రదేశంలో లేరు" అని అన్నారు.
వివరాలు
పిటిషన్‌పై విచారణ వచ్చే బుధవారం వరకు వాయిదా
దాంతో కోర్టు మరో ప్రశ్నను వేసింది, "ఇప్పుడు మీరు విచారణ కమిటీ నివేదిక సరైనదికాదని అంటున్నారా?" దీనికి వెంటనే సిబల్ "అలా నేను చెప్పడం లేదు" అని సమాధానమిచ్చారు. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు వచ్చే బుధవారం వరకు వాయిదా వేసింది. ఇక ఈ వివాదానికి నేపథ్యం ఇలా ఉంది - జస్టిస్ యశ్వంత్ వర్మ దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో, ఆయన నివాస అవరణంలో కాలిపోతున్న నోట్ల కట్టలు బయటపడ్డాయి. మంటలను అదుపు చేయడానికి వచ్చిన సిబ్బంది ఆ నగదును గుర్తించారు. ఈ సంఘటన నేపథ్యంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
వివరాలు
జస్టిస్ వర్మపై కొనసాగుతున్న అభిశంసన ప్రక్రియ
ఆ కమిటీ తన నివేదికలో ఆ నగదు బయటపడిన విషయం నిజమేనని స్పష్టం చేసింది. దాంతో జస్టిస్ వర్మకు రాజీనామా చేయాలని సీజేఐ సూచించారు. కానీ ఆయన రాజీనామాను తిరస్కరించడంతో ఆయనపై అభిశంసన ప్రక్రియను ప్రారంభించే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జస్టిస్ వర్మపై అభిశంసన ప్రక్రియ కొనసాగుతోంది.