
Nimisha Priya: యెమెన్‌లో నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష.. స్పందించిన సుప్రీం
ఈ వార్తాకథనం ఏంటి
యెమెన్ దేశంలో తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ శిక్షను జూలై 16న అమలు చేయనున్నట్లు సమాచారం. తాజా పరిణామాల్లో, ఈ కేసు సంబంధించి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పందించింది. నిమిష ప్రియను ఉరిశిక్ష నుండి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ పిటిషన్‌పై విచారణను జూలై 14న చేపట్టనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. జూలై 16న ఉరిశిక్ష అమలుకావడంతో దౌత్య చర్చలకు రెండు రోజులే సమయం మిగిలి ఉంటుందని, అలాంటి తక్కువ సమయంలో తీవ్రమైన పరిణామాలు సాధ్యం కావని సీనియర్ న్యాయవాది రాజేంత్ బసంత్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
2008లో నర్సింగ్ కోర్సు చేసిన నిమిష ప్రియ
అందువల్ల విచారణను త్వరగా నిర్వహించాలని ఆయన కోర్టును కోరారు. అలాగే, షరియత్ చట్టాల ప్రకారం బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తే నిమిష ప్రియకు విముక్తి లభించే అవకాశం ఉందని ఆయన ధర్మాసనానికి తెలియజేశారు. పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ 2008లో నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అనంతరం ఉద్యోగ అవకాశాల కోసం యెమెన్ వెళ్లారు. 2011లో ఆమె వివాహం జరిగింది.తరువాత ఆమె అక్కడ ఓ క్లినిక్ స్థాపించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లారు. యెమెన్ చట్టాల ప్రకారం,ఆమె వ్యాపార భాగస్వామిగా అక్కడి వ్యక్తి తలాల్ అదిబ్ మెహదీని ఎంపిక చేసుకున్నారు.
వివరాలు
మెహదీకి మత్తుమందు ఇచ్చి..
వారిద్దరూ కలిసి 'అల్ అమన్ మెడికల్ కౌన్సిల్' అనే ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో వ్యాపారం సజావుగా సాగినా,భర్త,కుమార్తె కేరళకు వెళ్లిన తరువాత, నిమిష ప్రియకు మెహదీ నుండి మానసిక వేధింపులు మొదలయ్యాయి. ఈ వేధింపుల నేపథ్యంలో,2017లో ఆమె అక్కడినుంచి తప్పించుకునే యత్నం చేశారు. మెహదీకి మత్తుమందు ఇచ్చి,అతని నుండి తన పాస్‌పోర్ట్ తిరిగి పొందాలని భావించారు. అయితే ఆ మత్తుమందు మోతాదు అధికంగా ఇవ్వడం వల్ల మెహదీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక కోర్టు నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించింది. తన కుమార్తెను రక్షించేందుకు నిమిష తల్లి ప్రేమకుమారి గత ఏడాది యెమెన్ వెళ్లారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి నిమిషను కాపాడుకునేందుకు ప్రయత్నించినా,ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.