Page Loader
Shashi Tharoor:కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో శశిథరూర్‌ సెల్ఫీ.. పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు బలం  
కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో శశిథరూర్‌ సెల్ఫీ.. పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు బలం

Shashi Tharoor:కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో శశిథరూర్‌ సెల్ఫీ.. పార్టీ మారనున్నారనే ఊహాగానాలకు బలం  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పార్టీని వీడే అవకాశముందని కొద్దిరోజులుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఆయన తీసుకున్న వైఖరిని శశిథరూర్‌ ప్రశంసించడం, అలాగే సీపీఎం ప్రభుత్వ విధానాలను మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు కారణంగా మారాయి. తాజాగా, శశిథరూర్‌ సోషల్‌ మీడియాలో చేసిన ఒక పోస్ట్‌ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. భారత్-యూకే వాణిజ్య ఒప్పందంపై చర్చల అనంతరం,కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌, బ్రిటన్‌ సెక్రటరీ ఆఫ్ ట్రేడ్ జోనాథన్ రేనాల్డ్స్‌లతో కలిసి ఉన్న ఫోటోను ఆయన షేర్‌ చేశారు. ఇరుదేశాల మధ్య కొంతకాలంగా నిలిచిపోయిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు పునఃప్రారంభమైనట్లు పేర్కొంటూ,ఇది మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

 బీజేపీలో చేరతారనే వార్తలు 

వారిని కలవడం సంతోషంగా అనిపించిందని వెల్లడించారు. గత కొద్దిరోజులుగా శశిథరూర్‌ వ్యవహారం కాంగ్రెస్‌కు దూరమవుతున్నట్లు కనిపిస్తోందని పలు మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. త్వరలో ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానమంత్రి మోదీకి మద్దతుగా అమెరికా పర్యటన సమయంలో ఆయన మాట్లాడటాన్ని కూడా ఈ ప్రచారానికి ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే, ఈ వార్తలను కాంగ్రెస్‌ నాయకత్వం ఖండించింది. పార్టీ ప్రయోజనాలను మాత్రమే కాదు, దేశ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాక, తాను సీపీఎం ప్రభుత్వ విధానాలను మెచ్చుకోలేదని, కేరళలో స్టార్టప్ రంగంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించానని శశిథరూర్‌ స్పష్టం చేశారు.

వివరాలు 

నా ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలు

శశిథరూర్‌ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి ఒక సందేశం ఇచ్చారు. ''పార్టీకి నా అవసరం లేకుంటే చెప్పండి. నా ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పార్టీ నన్ను కోరుకుంటే నేను అందుబాటులో ఉంటాను. లేకుంటే నాకు పుస్తకాలు, ప్రసంగాలు, అంతర్జాతీయ సదస్సుల కోసం ఎన్నో ఆహ్వానాలు ఉన్నాయి. సమయాన్ని ఉపయోగించుకునేందుకు నాకు వేరే అవకాశాలు లేవనుకోవద్దు'' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, ఆయన త్వరలోనే పార్టీ మారతారనే ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.