Page Loader
Sanjay Shirsat: మహారాష్ట్ర  శివసేన మంత్రి ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. వైరల్ వీడియోపై రాజకీయ దుమారం 

Sanjay Shirsat: మహారాష్ట్ర  శివసేన మంత్రి ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. వైరల్ వీడియోపై రాజకీయ దుమారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో ఓ మంత్రికి సంబంధించిన వీడియో ఒకటి తీవ్ర సంచలనంగా మారింది. ఆ వీడియోలో సంబంధిత మంత్రి పడకపై రిలాక్స్ అవుతూ కూర్చొన్నట్లు కనిపించగా,ఆయన పక్కన ఒక బ్యాగ్ ఉండి అందులో నోట్ల కట్టలున్నాయని ప్రచారం ఊపందుకుంది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్‌గా మారాయి. ఈ ఘటన వెనుక అసలు విషయం ఏమిటంటే... శివసేన (ఏక్‌నాథ్‌ షిండే వర్గం)కి చెందిన నేత, సామాజిక న్యాయ శాఖ మంత్రి అయిన సంజయ్ శిర్సాట్‌ తాజాగా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆయన 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆదాయానికి మించి సంపాదించిన ఆస్తులపై ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా శిర్సాట్‌ మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు.

వివరాలు 

ఆయన పక్కన కనిపించిన బ్యాగ్‌లో డబ్బుల కట్టలు

ఇదే సమయంలో మరో వివాదాస్పద వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం)కు చెందిన ప్రముఖ నేత సంజయ్ రౌత్ తన 'ఎక్స్' (పూర్వపు ట్విట్టర్‌) ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో శిర్సాట్‌ తన ఇంట్లోని ప్రైవేట్ గదిలో, పొగ తాగుతూ, ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు. ఆయన పక్కన కనిపించిన బ్యాగ్‌లో డబ్బుల కట్టలు ఉన్నాయని సంజయ్ రౌత్ ఆరోపించారు. తన పోస్టులో ''ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌పై జాలేస్తోంది. ఆయన పేరు ఇప్పుడు గాలిలో కలిసిపోతుంది. ఆయనకు ఎదురవుతున్న ఈ పరిస్థితులను చూస్తుంటే ఎంత బాధగా ఉంది. అసహాయతకు మరో పేరు ఫడణవీస్‌'' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ 

వివరాలు 

ఆదాయపన్ను విభాగం నుంచి నోటీసులు

ఔరంగాబాద్ (వెస్ట్‌) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శిర్సాట్‌ ప్రస్తుతం మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. తనకు ఆదాయపన్ను విభాగం నుంచి నోటీసులు అందాయని ధ్రువీకరిస్తూ నిన్న మీడియాతో మాట్లాడారు. ''కొంతమంది చేసిన ఫిర్యాదు ఆధారంగా నాకీ నోటీసులు అందాయి. నేను తప్పేమీ చేయలేదు. సంబంధిత అధికారులకు నా వైఖరిని వివరంగా తెలియజేస్తాను,'' అని స్పష్టం చేశారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే వైరల్‌ వీడియో వెలుగులోకి రావడం గమనార్హం. ఇక ఇదంతా జరుగుతుండగా శివసేన శిందే వర్గానికి చెందిన ఈ మంత్రికి ఐటీ నోటీసులు అందిన సమయంలోనే పార్టీ అధినేత ఏక్‌నాథ్‌ శిందే ముందుగా ప్రకటించని విధంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

"అది కేవలం దుస్తుల బ్యాగ్‌" - శిర్సాట్ స్పందన 

అక్కడ ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిశారని వార్తలు వచ్చాయి. వైరల్‌ వీడియోపై మంత్రి శిర్సాట్‌ స్పందించారు. ''ఆ వీడియోలో ఉంది మా ఇల్లే. నేను బెడ్‌రూంలో కూర్చుని ఉన్న దృశ్యం అది. నా పెంపుడు కుక్క కూడా అక్కడే ఉంది.ఎవరైనా గమనిస్తే ఇది నేను ప్రయాణం ముగించుకొని ఇంటికి వచ్చిన తరువాత, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తీసిన వీడియో అని తెలుస్తుంది. ఇక వీడియోలో కనిపిస్తున్న బ్యాగ్ గురించి మాట్లాడితే - మీరన్నట్టు అది డబ్బుల బ్యాగ్ అయితే నాకు ఇంట్లో బీరువాలు లేవా..? అది కేవలం దుస్తుల బ్యాగ్‌ మాత్రమే. దానిలో నోట్లు ఉన్నట్టు వారికి ఎందుకనిపిస్తోంది?'' అని విమర్శలను ఖండించారు.