Page Loader
Amaravati: అమరావతిలో స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్‌ ప్రభుత్వం.. నేడు సీఎం చంద్రబాబుతో భేటీ
అమరావతిలో స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్‌ ప్రభుత్వం.. నేడు సీఎం చంద్రబాబుతో భేటీ

Amaravati: అమరావతిలో స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్‌ ప్రభుత్వం.. నేడు సీఎం చంద్రబాబుతో భేటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు బుధవారం రాష్ట్రానికి వచ్చిన సింగపూర్ ప్రతినిధుల బృందం రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలను పరిశీలించింది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి స్టార్టప్ ఏరియా అభివృద్ధి తదితర అంశాలపై గురువారం చర్చించనున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేయడానికి సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 2017 మేలో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.

వివరాలు 

సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో స్టార్టప్ ఏరియా 

అయితే, జగన్ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టును రద్దు చేయడంతో పాటు అమరావతి అభివృద్ధిని కూడా పక్కన పెట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిలో వివిధ ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆహ్వానించడంతో, స్టార్టప్ ప్రాజెక్టుకు మళ్లీ అడుగులు పడనున్నాయి. రాజధాని అభివృద్ధికి చోదకశక్తిగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు చేపట్టాలని అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్-సింగ్ బ్రిడ్జి, సెంబ్‌కార్ప్ సంస్థల కన్సార్షియాన్ని స్విస్ ఛాలెంజ్ విధానంలో ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థ కలిసి అభివృద్ధి చేయాలనేది ప్రతిపాదన.

వివరాలు 

మూడు దశల్లో 1,691 ఎకరాల్లో అభివృద్ధి 

2017 మేలో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. తొలిదశలో కృష్ణానది, కరకట్ట మధ్య 170 ఎకరాలు కేటాయించగా, అక్కడ శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేకపోవడంతో మరో స్థలాన్ని కోరుతూ ఏడీపీ (ADP) అభ్యర్థించింది. చర్చలు జరుగుతున్న సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, పరస్పర అంగీకారంతో ప్రాజెక్టును రద్దు చేసింది. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియాను మూడు దశల్లో, 15 ఏళ్లలో అభివృద్ధి చేసేలా అప్పట్లో ప్రణాళిక రూపొందించారు. అనంతరం మరొక ఐదేళ్లలో మార్కెటింగ్ & విక్రయాలు పూర్తి చేయాలని నిర్ణయించారు.

వివరాలు 

రాష్ట్ర జీఎస్‌డీపీకి రూ.1.15 లక్షల కోట్లు 

అమరావతిలో స్టార్టప్ ప్రాజెక్టు ఎంతో కీలకం. ఇది ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో వాణిజ్య, నివాస, వినోద, పర్యాటక వసతులను అభివృద్ధి చేయడం దీని ప్రధాన లక్ష్యం. 1.25 లక్షల కుటుంబాలు అమరావతిలో స్థిరపడేలా ప్రోత్సహిస్తుంది. 2.50 లక్షల మందికి ప్రత్యక్ష & పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుంది. రాష్ట్ర జీఎస్‌డీపీకి రూ.1.15 లక్షల కోట్లు ఆదాయం తెస్తుంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు సమకూర్చే అవకాశం ఉంది.

వివరాలు 

కుయుక్తులు, కుట్రలతో రద్దు చేసిన జగన్ ప్రభుత్వం 

2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కుయుక్తులు, కుట్రలతో అమరావతి అభివృద్ధిని పక్కకు పెట్టారు. దాని భాగంగా, స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును 2019 నవంబరు 12న రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లో సీఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రణాళికను ప్రకటించగా, పెట్టుబడిదారుల నమ్మకాన్ని ఆయన తొలగించారని పలువురు పరిశీలకులు విమర్శించారు. మళ్లీ అభివృద్ధి బాటలో స్టార్టప్ ఏరియా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, అమరావతిలో మళ్లీ అభివృద్ధి పునరుద్ధరమవుతోంది. సింగపూర్ ప్రభుత్వం కూడా మరోసారి ముందుకొచ్చి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి చూపుతోంది.