Ranjeeta Priyadarshini: నెలసరి సమయంలో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి.. ఐరాస వేదికగా భారత్‌కు చెందిన ఉద్యమకారిణి
నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంటూ ఐక్యరాజ్య సమితి (UN) సమావేశంలో ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని గళం విప్పారు. ఆమె మాట్లాడుతూ, మహిళలు జీతం కోత పడుతుందని ఆలోచించకుండా సెలవు తీసుకోగలుగుతారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె న్యూయార్క్ నగరంలో జరిగిన 79వ సర్వసభ్య ప్రతినిధి సభలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్' కార్యక్రమంలో చేసినది. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించడానికి ఆమె కృషి చేస్తున్నది.
కర్ణాటక ప్రభుత్వ చర్యను అభినందించిన ప్రియదర్శిని
"రెండోసారి ఐరాస సదస్సుకు హాజరైనందుకు నాకు గర్వంగా ఉంది.నెలసరి రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నదే నా ప్రధాన లక్ష్యం. ఆ రోజుల్లోఒకటి నుంచి రెండు రోజులు సెలవులు ఇవ్వాలి. జీతం ఇవ్వకపోతే,ఏ మహిళా కూడా ఆ సెలవు తీసుకోదు.కెన్యాలో జరిగిన ఐరాస సదస్సులో ఈ విషయాన్ని మొదటగా ప్రస్తావించాను"అని ప్రియదర్శిని తెలిపారు. కెన్యా సదస్సు అనంతరం ఒడిశా ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి పెయిడ్ పీరియడ్ లీవ్ ఇనిషియేటివ్‌ను అమలుచేస్తున్నది. అలాగే, కర్ణాటక ప్రభుత్వం ఏడాదికి ఆ తరహాలో ఆరు సెలవులు ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వ చర్యను అభినందించిన ఆమె, ఆ సెలవుల సంఖ్యను 12కు పెంచాలని కోరారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒడిశా ప్రభుత్వం మహిళలకు శుభవార్త
తన పోరాటం వెనక వ్యక్తిగత అనుభవాలు కారణమని ఆమె వెల్లడించారు. ఆమె సెలవు కోరినందుకు తన మేనేజర్ నుండి అవమానం ఎదుర్కొన్నా,ఆ తరువాత ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పారు. ఆమె ప్రయత్నాలు నెలసరి ఆరోగ్యంపై చర్చ ప్రారంభించేందుకు,సంబంధిత నిర్ణయాలు తీసుకోవడానికి దోహదం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే,స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒడిశా ప్రభుత్వం మహిళలకు శుభవార్త ప్రకటించింది. ప్రభుత్వ,ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ పాలసీ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.మహిళా ఉద్యోగులు ప్రతినెలా తమ రుతుక్రమంలో మొదటి లేదా రెండో రోజు ఈ సెలవు తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యం,శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.