
SC:'వాక్ స్వాతంత్య్రం దుర్వినియోగం అవుతోంది': ప్రధానిపై పోస్ట్ చేసిన కార్టూనిస్టును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అతడికి అరెస్టు నుంచి రక్షణ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇటీవల కొంతమంది కళాకారులు, కార్టూనిస్టులు, స్టాండప్ కమెడియన్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ,ఆర్‌ఎస్‌ఎస్‌పై వేసిన కార్టూన్ వివాదాస్పదంగా ఉండటంతో హేమంత్ మాలవీయపై గతంలో కేసు నమోదైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ప్రధాని మోదీ,ఆర్‌ఎస్‌ఎస్‌పై అభ్యంతరకర కార్టూన్ వేసిన కారణంగా మాలవీయపై కేసు నమోదైనట్లు స్పష్టం చేసింది.
వివరాలు
కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో ఆ కార్టూన్ ప్రచురించాం: మాలవీయ
ఇంతకుముందు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన మాలవీయ, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 3న జరిగిన విచారణలో హైకోర్టు మాలవీయ కార్టూన్ గీయడంలో విచక్షణ లేకుండా ప్రవర్తించాడని వ్యాఖ్యానిస్తూ, ఆయన పెట్టిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో హేమంత్ మాలవీయ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో ఆ కార్టూన్ ప్రచురించామని మాలవీయ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. టీకాల భద్రతపై తప్పుడు సమాచారం, ప్రజల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడు, ఓ సాధారణ పౌరుడికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు వ్యంగ్య చిత్రాన్ని గీశానని తెలిపారు. ఇందులో ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని మాలవీయ స్పష్టం చేశారు.