
Supreme Court: రోడ్డు మరణాలను అరికట్టడంలో కేంద్రం విఫలం.. క్యాష్‌లెస్ చికిత్సపై కేంద్రం అలసత్వానికి సుప్రీంకోర్టు ఆగ్రహం..అధికారులకు సమన్లు
ఈ వార్తాకథనం ఏంటి
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి నగదు అవసరం లేకుండా వైద్యం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పథకం అమలులో ఆలస్యం చేస్తున్నందుకు సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈచర్యను తీవ్రమైన కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా పరిగణిస్తున్నామని పేర్కొంటూ బుధవారం సంబంధిత కేంద్ర అధికారులకు సమన్లు జారీ చేసింది.
ఈపథకం ద్వారా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే,ముఖ్యంగా గోల్డెన్ అవర్‌లో(ప్రమాదం జరిగిన ఒక గంట సమయంలో)బాధితులకు సమీపంలోని ఆసుపత్రుల్లో తక్షణ వైద్యసేవలు నగదు చెల్లింపుల అవసరం లేకుండా అందించాలి.
ఈపథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు గత మార్చి14వ తేదీనే గడువుగా నిర్దేశించింది.
కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈదిశగా కసరత్తు ప్రారంభించకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివరాలు
కోర్టు సమన్లు
జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆలస్యతపై మండిపడి,"మేమిచ్చిన గడువు ముగిసిపోయింది. ఇది కోర్టు ఆదేశాల తీవ్రమైన విరోధమే" అంటూ పేర్కొంది.
దీనితో రోడ్డు రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సహా సీనియర్ అధికారులకు కోర్టు సమన్లు జారీచేసింది.
"కోర్టుకు హాజరైనపుడే అధికారులు మా ఆదేశాలను సీరియస్‌గా తీసుకుంటారు. ఇది మాకు అనుభవం ద్వారా వచ్చిన స్పష్టమైన విషయం. ఏప్రిల్ 28న సమన్లు అందుకున్నవారు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలి. సకాలంలో చికిత్స అందాకా రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో దేశంలో చాలామంది మరణిస్తున్నారు.ఇది మేము సహించము. ఎటువంటి పురోగతి లేకపోతే కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది" అని జస్టిస్ ఓకా హెచ్చరించారు.
వివరాలు
కేంద్ర ప్రభుత్వం నగదు రహిత వైద్య చికిత్సపై తొలి అడుగు
ఇక రోడ్డు ప్రమాదాల సమయంలో..ఆ దారిన వెళ్లేవాళ్లు, పోలీసులు, ఆసుపత్రులు ఇలా ప్రతివారూ ఎవరైనా ముందుకు వస్తారేమో అని ఎదురు చూసే పరిస్థితి నెలకొనడం బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇది బాధితుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా,2023 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నగదు రహిత వైద్య చికిత్సపై తొలి అడుగు వేసింది.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి ఉచితంగా వైద్యం అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన ఈ పథకం 2019లో చేసిన మోటార్ వాహనాల చట్ట సవరణలో భాగంగా ఉంది.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈపథకం ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ,దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖతో కలిసి రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంది.
వివరాలు
ఆసుపత్రి చికిత్సకు ఏడురోజుల పాటు రూ.1.5 లక్ష
ప్రమాద సమయంలో బాధితులకు కుటుంబ సభ్యులు లేదా ఏదైనా వ్యక్తి నగదు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, గోల్డెన్ అవర్‌లో ఈ స్కీమ్ ద్వారా అత్యవసర చికిత్సను ఉచితంగా అందించాలి.
క్యాష్‌లెస్ ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ స్కీమ్ ప్రకారం, ఆసుపత్రి చికిత్సకు ఏడురోజుల పాటు రూ.1.5 లక్షల వరకు ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది.
అయితే ఇది ప్రమాదం జరిగిన 24 గంటల్లోపే పోలీసులకు సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే వర్తిస్తుంది.
చికిత్సకు అవసరమైన ఖర్చును ఆసుపత్రులు మోటార్ వాహనాల చట్టం కింద ఉన్న ఫండ్ ద్వారా రీయింబర్స్‌మెంట్ రూపంలో పొందుతాయి.
అదనంగా, హిట్ అండ్ రన్ ఘటనల్లో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సహాయం) కూడా ప్రభుత్వం అందిస్తుంది.
వివరాలు
బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును బీమా కంపెనీలు భరించాలి
అయితే, ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా గత ఏడాదిన్నరగా చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు.
సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 8వ తేదీన కేంద్రానికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
మోటార్ వాహనాల చట్టం సవరణలోని సెక్షన్ 162(2) ప్రకారం, బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును బీమా కంపెనీలు భరించాల్సి ఉంటుంది.
కానీ, ఇది కూడా ఇప్పటివరకు అమలులోకి రాకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.