LOADING...
Supreme Court: వివేకానంద రెడ్డి హత్యకేసు..తదుపరి దర్యాప్తుపై సీబీఐని స్పష్టత కోరిన సుప్రీంకోర్టు  
వివేకానంద రెడ్డి హత్యకేసు..తదుపరి దర్యాప్తుపై సీబీఐని స్పష్టత కోరిన సుప్రీంకోర్టు

Supreme Court: వివేకానంద రెడ్డి హత్యకేసు..తదుపరి దర్యాప్తుపై సీబీఐని స్పష్టత కోరిన సుప్రీంకోర్టు  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేక అవసరం లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ అంశంపై సీబీఐ నివేదికను పరిశీలించిన తరువాతే నిందితుల బెయిళ్ల రద్దు,మంజూరు పిటిషన్లపై విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ఈ కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర రెడ్డిల బెయిళ్లు రద్దు చేయాలని, ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దని, అంతిమ కుట్రదారుడు ఎవరో తేల్చేలా దర్యాప్తు కొనసాగించాలంటూ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఇక సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర రెడ్డి బెయిళ్లను రద్దు చేయాలని సీబీఐ కూడా పిటిషన్ వేసింది.

వివరాలు 

 మొత్తం 11 పిటిషన్లపై ధర్మాసనం విచారణ

తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఎర్ర గంగిరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నిటితో కలిపి మొత్తం 11 పిటిషన్లపై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్వీ కోటీశ్వర సింగ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేసు ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నాయో, సీబీఐ ఎలా ముందుకు వెళ్లాలని భావిస్తోంది అనేదానిపై స్పష్టత అవసరమని పేర్కొంది. ఆ నివేదిక ఆధారంగా తదుపరి ఉత్తర్వులు ఇస్తామని జస్టిస్ సుందరేష్ పేర్కొన్నారు.

వివరాలు 

ఆ నివేదికను కోర్టు తిరస్కరిస్తోంది 

వాదనలు మొదలుపెట్టిన సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మాట్లాడుతూ - ''వివేకా కుమార్తె, అల్లుడిపై ఉన్న కేసులను మూసివేయాలంటూ రాష్ట్ర పోలీసులు ఇచ్చిన క్లోజర్ రిపోర్టును పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది.ఈ ప్రధాన హత్య కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని కారణం చూపుతూ ఆ రిపోర్టును తిరస్కరించింది.అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నాం.శివశంకర్ రెడ్డి కుమారుడు జైలుకు వెళ్లి ప్రధాన అప్రూవర్ అయిన దస్తగిరిని బెదిరించిన విషయం తెలంగాణ హైకోర్టులో నివేదించాం. అయినా ఆయనకు బెయిల్ మంజూరు చేయడం సరికాదని తెలుపాం.కానీ హైకోర్టు మా వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది.అందుకే ఆ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాం''అని తెలిపారు.

వివరాలు 

ఆ నివేదికను కోర్టు తిరస్కరిస్తోంది 

జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ - ''బెయిల్, ముందస్తు బెయిల్ అప్లికేషన్లపై విచారణ చేస్తాం. అయితే ముందు కేసు ప్రస్తుత పరిస్థితి ఏమిటో వివరించండి'' అని సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) భాస్కర్ ఠాక్రేను ప్రశ్నించారు. దీనికి ఏఎస్‌జీ సమాధానంగా ''ఈ కేసు ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (హైదరాబాద్)లో ఉన్నదని, క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్ 207వ దశ (చార్జ్‌షీట్ ఆధారంగా కేసు నమోదు)లో ఉందని'' తెలిపారు. దీంతో సిద్ధార్థ లూథ్రా మధ్యలో జోక్యం చేసుకుంటూ - ''కేసు నాలుగేళ్లుగా అదే స్థాయిలో ఉంది. ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు'' అని వ్యాఖ్యానించారు. దీనిపై కారణం ఏమిటో తెలుసుకోవాలని జస్టిస్ సుందరేష్ అడిగారు.

వివరాలు 

తదుపరి దర్యాప్తు గురించి ప్రశ్న 

నిందితుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నాగముత్తు స్పందిస్తూ - ''సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందని చెబుతోంది'' అని పేర్కొన్నారు. ''మీరు మరింత దర్యాప్తు చేయాలనుకుంటున్నారా?'' అని ఏఎస్‌జీని జస్టిస్ సుందరేష్ ప్రశ్నించారు. దీనికి ఏఎస్‌జీ ''ట్రయల్ కోర్టులో అభియోగాలు నమోదు కావడం కొనసాగుతుండగా, దర్యాప్తును కూడా కొనసాగించవచ్చని'' సమాధానమిచ్చారు.

వివరాలు 

ఆ ప్రొసీడింగ్స్‌ను క్రియాశీలకం చేయాలి..

''ఇప్పుడైన ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాలి. లేకపోతే కేసు అనిశ్చితిలో కొనసాగుతుంది. అందుకే 207 స్టేజ్ నుంచి విచారణను ముందుకు సాగించాలని సూచిస్తాం. సునీత దాఖలు చేసిన దర్యాప్తు పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున, దర్యాప్తు కొనసాగాలనుకుంటున్నారా? లేక వద్దా? అనే విషయంలో మీరు స్పష్టత ఇవ్వాలి. ఆ మేరకు ట్రయల్ కోర్టుకు చెప్పి, దర్యాప్తుపై తీసుకునే నిర్ణయాన్ని మెరిట్స్ ఆధారంగా ఇవ్వాలని ఆదేశిస్తాం. దర్యాప్తు సంస్థ అభిప్రాయాన్ని కోరుతున్నాం'' అని జస్టిస్ సుందరేష్ సీబీఐ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి ఏఎస్‌జీ ''సంస్థ అభిప్రాయాన్ని తెలుసుకొని కోర్టుకు తెలియజేస్తాం'' అని ధర్మాసనాన్ని విన్నవించారు.

వివరాలు 

కేసు నెమ్మదిగా సాగడానికి కారణం 

నాగముత్తు వాదనలు కొనసాగిస్తూ - ''ఈ కేసు 207వ దశ దాటకపోవడానికి ప్రధాన కారణం - సీబీఐ దాఖలు చేసిన 4,77,800 సాఫ్ట్ ఫైల్స్ కాపీలే. ఒక్కో ఫైల్‌లో 2 పేజీలున్నాయనుకుంటే కనీసం 10 లక్షల పేజీలు. వాటిని చదవడానికి ట్రయల్ కోర్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది'' అని వివరించారు. దీనిపై జస్టిస్ సుందరేష్ జోక్యం చేసుకుంటూ - ''దర్యాప్తుపై సీబీఐ అభిప్రాయాన్ని అడిగినదే అందుకే'' అని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది.