LOADING...
Supreme Court: వక్ఫ్‌ చట్టంపై నేడు సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
వక్ఫ్‌ చట్టంపై నేడు సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

Supreme Court: వక్ఫ్‌ చట్టంపై నేడు సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై సోమవారం (ఉదయం 10.30 గంటలకు) మధ్యంతర తీర్పు ఇవ్వనుంది. కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్‌ (సవరణ) చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే విచారణ జరిపి, ఉత్తర్వులను రిజర్వ్‌ చేసింది. ఈ తీర్పులో కోర్టు మూడు ప్రధాన అంశాలపై స్పష్టత ఇవ్వనుంది. వాటిలో మొదటిది—వక్ఫ్ జాబితాలో చేర్చిన ఆస్తులను కోర్టులు డీనోటిఫై చేయగలవా లేదా? రెండవది—రాష్ట్ర వక్ఫ్ బోర్డు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతర సభ్యులకు చోటు కల్పించడం సాధ్యమా? మూడవది—ఒక ఆస్తి ప్రభుత్వ భూమి కాదో కలెక్టర్‌ విచారణ చేసి నిర్ణయించే అధికారం కలిగించవచ్చా అనే ప్రశ్నమొదలైంది.

Details

కేంద్రం తరుపున తుషార్ మెహత వాదనలు

మే 22న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని ఉత్తర్వులను రిజర్వ్‌ చేసింది. అప్పట్లో మూడు రోజుల పాటు వరుసగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు, అలాగే కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహత వాదనలు వినిపించారు. పిటిషనర్లు డీనోటిఫికేషన్ అంశం మాత్రమే కాకుండా, రాష్ట్ర వక్ఫ్ బోర్డు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ నిర్మాణ విధానాన్ని కూడా ప్రశ్నించారు. ఈ సంస్థలు పూర్తిగా ముస్లింల ఆధ్వర్యంలోనే నడవాలని వారు కోర్టుకు వివరించారు. అంతేకాదు, కలెక్టర్లకు వక్ఫ్‌ ఆస్తులపై తీర్పు చెప్పే అధికారం ఇస్తే, వారు ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరించే అవకాశం ఉందని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Details

1,332 పేజీల ప్రాథమిక అఫిడవిట్‌ దాఖలు

ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని బలంగా సమర్థించింది. వక్ఫ్ అనేది లౌకిక వ్యవస్థ మాత్రమేనని, ఇది ఇస్లామిక్ సూత్రాల్లో ప్రధాన భాగం కాదని స్పష్టం చేసింది. కాబట్టి పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని ఆపే అధికారం కోర్టుకు లేదని కేంద్రం వాదించింది. మరోవైపు, పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్ హాజరై, ఈ చట్టం చారిత్రక చట్టాలకు, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని వాదించారు. వక్ఫ్ ఆస్తులపై చట్టవిరుద్ధంగా నియంత్రణ సాధించడం కోసం ఈ సవరణలు చేసినట్లుగా ఆరోపించారు. ఏప్రిల్ 25న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ చట్టాన్ని సమర్థిస్తూ 1,332 పేజీల ప్రాథమిక అఫిడవిట్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది.

Details

ఏప్రిల్ 5న రాష్ట్రపతి ఆమోదం

పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని రాజ్యాంగబద్ధంగా పరిగణించాల్సి వస్తుందని, అందువల్ల దానిపై ఏవైనా సామూహిక నిషేధాలు విధించవద్దని కోర్టును కోరింది. అంతకుముందు ఏప్రిల్ 8న వక్ఫ్‌ (సవరణ) చట్టం, 2025ను కేంద్రం నోటిఫై చేసింది. ఏప్రిల్ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి ఆమోదం తెలిపారు. దానికి ముందు ఏప్రిల్ 3న లోక్‌సభ, ఏప్రిల్ 4న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. మొత్తంగా, డీనోటిఫికేషన్, వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యుల భాగస్వామ్యం, కలెక్టర్‌ అధికారాలపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించనుంది.