
Andhra Pradesh: TCSకు 21.6 ఎకరాల భూమి కేటాయించిన ఎపి ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు కేవలం 99 పైసల ధరకు 21.6 ఎకరాల భూమిని కేటాయించింది.
ఈ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఏప్రిల్ 15న సమావేశమై అంగీకారం తెలిపింది.గుజరాత్ ప్రభుత్వం ఇటీవల టాటా మోటార్స్‌కు 99 పైసలకు భూమిని కేటాయించిన నేపథ్యంలో,ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ తాజా అభివృద్ధి ప్రాధాన్యత సంతరించుకుంది.
విశాఖపట్టణం నగరంలోని ఐటీ హిల్-3 ప్రాంతంలో TCSకు 21.66 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు,ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 3.5 ఎకరాల భూమిని కేటాయించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్రానికి అధిక స్థాయిలో ఐటీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
వివరాలు
రాష్ట్ర ప్రభుత్వం, TCS మధ్య చర్చలు
విశాఖపట్నంను ఒక సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
ఈ కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించగా, పలు కీలక నిర్ణయాల మధ్య ఈ భూ కేటాయింపుల అంశం ప్రాధాన్యత పొందింది.
గత ఏడాది అక్టోబర్ 2024లో నారా లోకేశ్ ముంబైలో టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్థాయిలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయమని TCSను ఆహ్వానించారు.
ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, TCS మధ్య కొనసాగిన చర్చల ఫలితంగా ఈ రోజు ఈ భూమిని కేటాయించడంపై అంగీకారం వెలువడింది.
వివరాలు
కంపెనీలకు రాష్ట్రంపై నమ్మకం పెరిగేలా..
ఈ నేపథ్యంలో, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా తదుపరి పెద్ద కేంద్రంగా ఎదగనున్నదని,దీనివల్ల పెట్టుబడిదారులకు రాష్ట్రంలోని వనరులతో పాటు ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుందని స్పష్టం చేశారు.TCSకు ఇచ్చిన ఈ ఆఫర్ ద్వారా ఇతర కంపెనీలకు రాష్ట్రంపై నమ్మకం పెరిగేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే గుజరాత్‌లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, సనంద్ ప్రాంతంలో టాటా మోటార్స్‌కు 99 పైసలకు భూమి కేటాయించగా, అది ఆ రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ ఆటో మొబైల్ కేంద్రంగా మారేందుకు దోహదపడింది. అలాగే, టాటా ఎలక్ట్రానిక్స్‌కు గుజరాత్ ప్రభుత్వం ధోలేరాలో విస్తరణ కోసం అవసరమైతే 63 ఎకరాల భూమిని అందిస్తామని హామీ ఇచ్చింది.
వివరాలు
టెక్ రంగంలో ప్రత్యేకమైన స్థానం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో ముందుకు సాగుతూ, టెక్ రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే వైజాగ్‌లో టిసిఎస్ చేపట్టబోయే కార్యకలాపాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.