LOADING...
Telangana: గిగ్ వర్కర్లకు తెలంగాణ గుడ్ న్యూస్.. ఇన్సూరెన్స్, పెన్షన్ సదుపాయాలు సిద్ధం
గిగ్ వర్కర్లకు తెలంగాణ గుడ్ న్యూస్.. ఇన్సూరెన్స్, పెన్షన్ సదుపాయాలు సిద్ధం

Telangana: గిగ్ వర్కర్లకు తెలంగాణ గుడ్ న్యూస్.. ఇన్సూరెన్స్, పెన్షన్ సదుపాయాలు సిద్ధం

వ్రాసిన వారు Moogati Shabari
Mar 30, 2026
08:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జప్టో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. వీరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టానికి సోమవారం ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నూతన చట్టం ప్రకారం గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి వర్కర్‌కు ప్రత్యేక గుర్తింపు (యూనిక్ ఐడీ) ఇవ్వడం పాటు, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలను అందించనున్నారు. ఇప్పుడు ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

వివరాలు

గిగ్ వర్కర్లకు విస్తృత ప్రయోజనాలు

గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన 2026 బిల్లును కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, దానికి సభ ఆమోదం తెలిపింది. చట్టం అమల్లోకి వస్తే గిగ్ వర్కర్లకు చట్టబద్ధ హక్కులు లభిస్తాయి. కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న గిగ్ వర్కర్ల వివరాలను నిరంతరం ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి ఎలక్ట్రానిక్ రిటర్న్స్ సమర్పించడం తప్పనిసరి అవుతుంది. అదేవిధంగా ప్రతి గిగ్ వర్కర్‌కు ఒక ప్రత్యేక యూనిక్ ఐడీ జారీ చేస్తారు. ఇన్సూరెన్స్, పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలు (మెటర్నిటీ బెనిఫిట్స్) వంటి సదుపాయాలు కల్పించనున్నారు. వీరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేస్తారు. గిగ్ వర్కర్ల కోసం ఫండ్‌ను 1 నుంచి 2 శాతం లెవీతో ప్రారంభించనున్నారు.

వివరాలు

సంక్షేమ బోర్డు ద్వారా పర్యవేక్షణ..

ఈ బిల్లులో భాగంగా గిగ్ వర్కర్లకు సంబంధించిన జీతాలు, కోతల వివరాలను సంస్థలు వెల్లడించేలా చర్యలు ఉంటాయి. అలాగే యాప్‌లలో ఉపయోగించే అల్గోరిథమ్స్ ద్వారా ఎలాంటి వివక్ష జరగకుండా చూడాలని కూడా సూచించారు. ప్రతి లావాదేవీపై వసూలు చేసే ఫీజులో గరిష్టంగా 5 శాతం వరకు సంక్షేమ బోర్డు నిర్వహణ ఖర్చులకు వినియోగించనున్నారు. మొత్తం 20 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేస్తారు. ఇందులో గిగ్ వర్కర్లు, అగ్రిగేటర్ సంస్థల ప్రతినిధులు ఉంటారు. ఈ బోర్డు ప్రతి సంవత్సరం సమావేశాలు నిర్వహిస్తుంది.

Advertisement

వివరాలు

అన్ని కంపెనీలకు ఉపయోగం..

గిగ్ వర్కర్లు రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న తర్వాత వారికి యూనిక్ ఐడీ అందుతుంది. అది అన్ని కంపెనీలలో ఉపయోగపడుతుంది. గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారులతో పాటు ప్లాట్‌ఫామ్ స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. వర్కర్లు తమ సమస్యలను ఈ కమిటీలకు తెలియజేసే అవకాశం ఉంటుంది. ఈ చట్టం ద్వారా గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతతో పాటు గౌరవప్రదమైన స్థానం కల్పించడమే లక్ష్యం.

Advertisement