Page Loader
School Teachers: టీచర్లకూ ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు.. సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు..
టీచర్లకూ ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు.. సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు..

School Teachers: టీచర్లకూ ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు.. సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను అమలు చేయడానికి పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే విద్యార్థుల హాజరును నమోదు చేయడానికి రెండు సంవత్సరాల క్రితమే ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. అప్పటి నుంచి విద్యార్థులపై ఈ వ్యవస్థను అమలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయుల హాజరును కూడా ఇదే యాప్ ద్వారా నమోదు చేయాలన్న ఉద్దేశంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం అనుమతి కోసం పంపారు.

వివరాలు 

2023 సెప్టెంబరులో యాప్ అభివృద్ధి

పాఠశాల విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం ఇచ్చిన వెంటనే అధికారులు ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ యాప్ 2023 సెప్టెంబరులో అభివృద్ధి చేయబడింది. కృత్రిమ మేధసాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ ద్వారా హాజరు నమోదు కోసం ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. యాప్‌ను ఓపెన్ చేసి విద్యార్థుల ముఖాలు చూపడం ద్వారా హాజరును నమోదు చేయవచ్చు. ఒకేసారి 15 నుండి 20 మందిని చూపించినా సరిపోతుంది. ఈ విధానం ద్వారా విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపడం, మధ్యాహ్న భోజనం వాడిన వారి సంఖ్యను పెంచి చూపించే వంటి మోసాలకు అడ్డుకట్ట పడుతుంది.

వివరాలు 

గత డిసెంబరు నుంచి పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా... 

గతేడాది డిసెంబరు నుంచి పెద్దపల్లి జిల్లాలో ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల హాజరును కూడా ముఖ గుర్తింపు విధానంలో నమోదు చేస్తున్నారు. ఉపాధ్యాయుడు పాఠశాల ప్రాంగణంలో ఉన్నప్పుడే హాజరు నమోదు చేయడం సాధ్యమవుతుంది. జిల్లాలో అధికారులు తీసుకున్న చొరవతో ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమయ్యింది. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు హాజరవుతుండటంతో హాజరు శాతం కూడా పెరిగిందని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా 32జిల్లాల్లో కూడా ఈ విధానాన్ని విస్తరించాలన్న యోచనతో ఉన్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు ఆలస్యంగా పాఠశాలలకు రావడం,బదులుగా విద్యావాలంటీర్లను పెట్టడం వంటి ఉదంతాలు కొనసాగుతున్నాయని,గతేడాది సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈ తరహా ఘటనలు నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

వివరాలు 

విద్యను క్రమబద్ధంగా నిర్వహిస్తేనే తల్లిదండ్రులకు నమ్మకం

కొంతమంది ఉపాధ్యాయులు సంవత్సరాంతం పాఠశాలకు హాజరు కాకుండా ఉండిపోతున్నారని, వారిని నియంత్రించడానికి ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలో ఉంటే, విద్యను క్రమబద్ధంగా నిర్వహిస్తేనే తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతుందని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన ఒక ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. ''ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు రావడం, బోధన చేయడం వల్లే తల్లిదండ్రుల నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకంతోనే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అందుకోసం ఎఫ్‌ఆర్‌ఎస్‌ను తప్పనిసరిగా అమలు చేయాలి'' అని పేర్కొన్నారు.