నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అమిత్ షాతో కీలక భేటీ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు మంత్రి కేటీఆర్ దేశ రాజధానిలోనే మకాం వేయనున్నారు. ఈ క్రమంలోనే పలువురు కేంద్రమంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు.ఇదే సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా కేటీఆర్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా తెలంగాణలో భాజపా, బీఆర్ఎస్ ఉప్పు నిప్పుగా ఉంటున్నాయి. గతంలోనూ కేటీఆర్ దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిశారు. కానీ అమిత్ షాతో భేటీ జరగలేదు. చాలా రోజులకు జరుగుతున్న ఈ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు, సహకారం కోసమే మంత్రి కేటీఆర్ దిల్లీ పర్యటన
రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారాన్ని అడిగేందుకే దిల్లీ పర్యటన చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సమావేశంలో రాజకీయ వ్యవహారాలు సైతం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులకు సాయం కోరేందుకే షాతో భేటీ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు, కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న భూములు అడ్డంకిగా మారుతున్న క్రమంలో సమస్య పరిష్కారం కోసమే షాతో భేటీ అవుతున్నారని వెల్లడించాయి. స్కై వేల నిర్మాణం కోసం కంటోన్మెంట్ భూముల వ్యవహారంపై ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌నూ కలిసే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్ పోర్ట్ సహా మెట్రో విస్తరణ అంశంపై పలువురు కేంద్రమంత్రులతోనూ కేటీఆర్ భేటీ కానున్నారు.