పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా?
దేశ రాజకీయాలో కీలక పరిణామంగా భావించే ప్రతిపక్ష నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు నేతలు శుక్రవారం బిహార్ రాజధాని పాట్నకు చేరుకున్నారు. రాజకీయ పార్టీలే కాకుండా దేశం మొత్తం ఈ సమావేశంపై అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆతిథ్యం ఇవ్వనున్నఈ సమావేశం బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో కీలకంగా మారుతుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇది మంచి పరిణామంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, శరద్ పవార్, మెహబూబా ముఫ్తీ, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు హాజరయ్యారయ్యేందుకు పాట్నకు చేరుకున్నారు.
ఇదొక చారత్రక సమావేశం: జేడీయూ
రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌదరి ప్రతిపక్ష నేతల సమావేశానికి హాజరు కావడం లేదు. కుటుంబ కార్యక్రమాల వల్ల హాజరు కావడం లేదని నితీష్ కుమార్‌కు ఆయన గురువారం లేఖ రాశారు. పాట్నలో జరుగుతున్న ఈ కాన్‌క్లేవ్‌ను చారిత్రక సమావేశంగా జేడీయూ నేత, బిహార్ మంత్రి విజయ్ చౌదరి అభివర్ణించారు. ఎందుకంటే ఇటువంటి సమావేశంలో గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. బీజేపీపై పోరాటానికి ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) రూపొందించాల్సిన అవసరాన్ని బిహార్ కాంగ్రెస్ చీఫ్ అఖిలేష్ ప్రసాద్ సింగ్ నొక్కి చెప్పారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోటీ చేస్తే, బీజేపీ సంఖ్య 100 కంటే తక్కువ సీట్లకు తగ్గుతుందని పేర్కొన్నారు.
ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించేది ఎవరు?
పాట్న సమ్మేళనం బీజేపీని ఎదుర్కోవడానికి ఐక్య ప్రయత్నంగా భావిస్తున్నప్పటికీ, దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానమంత్రి పదవి ఎవరిది అనే విషయంతో పాటు, సీట్ల పంపకం ప్రతిపక్ష పార్టీలకు ఆందోళన కలిగించే అంశం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా సీట్లలో ఆ పార్టీకే మద్దతిస్తామని తృణమూల్ గతంలోనే ప్రకటించింది. మరోవైపు నాయకత్వం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తృణమూల్ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ పేర్కొన్నారు. అయితే విపక్షాల సమావేశాన్ని వ్యర్థమైన కసరత్తుగా బీజేపీ కొట్టిపారేసింది. అవకాశవాద కూటమి ఎటువంటి ఫలితాలను ఇవ్వదని పేర్కొంది.