Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని భావిస్తున్నారు. ఈ అంశంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రచారంలో భాగంగా ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
సంక్రాంతికి 'డాకూ మహారాజ్'
అంతేకాదు, బాలకృష్ణ ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'డాకూ మహారాజ్'ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు బాబీ, నాగవంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమ పరిస్థితులపై మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటనపై జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని అడగ్గా, సినిమా విడుదల సమయంలో అన్ని చోట్ల పర్యవేక్షణ సాధ్యం కాకపోయినా, భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌కు మార్చాలని వస్తున్న ఊహాగానాలపై స్పందించిన నాగవంశీ, తాను హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకున్నానని, మరో రాష్ట్రానికి మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు
పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాలకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తోందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో, సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన కారణంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సినిమాలకు టికెట్ ధరలు పెంచకుండా, ప్రీమియర్ షోల అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించడంతో చిత్ర పరిశ్రమలో కలకలం చెలరేగింది. సంక్రాంతి వంటి ముఖ్యమైన సీజన్‌కు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ నిర్ణయం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు, ఇతర మినహాయింపులపై చర్చించేందుకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని నిర్ణయించారు. ఈ సంధర్భంలో దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి వచ్చాక, తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.