
Telangana: ఆదిలాబాద్‌లో 43.5 డిగ్రీలు ఉష్ణోగ్రత.. తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఎండలు విజృంభిస్తున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో భానుడు భగభగలతో మండిపోగా, గరిష్టంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
నిజామాబాద్‌లో 43.1 డిగ్రీలు, భద్రాచలం 39.4 డిగ్రీలు, దుండిగల్ 38.7 డిగ్రీలు, హకీంపేట 38.5 డిగ్రీలు, హన్మకొండ 40 డిగ్రీలు, ఖమ్మం 40.4 డిగ్రీలు, మహబూబ్‌నగర్ 40డిగ్రీలు, రామగుండం 41.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించడంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి పైగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Details
రానున్న ముడ్రోజుల్లో వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈశాన్య విదర్భ నుంచి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉంది.
దీంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.
దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Details
ఈ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం
తెలంగాణలోని 24 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్నిచోట్ల వడగళ్ల వానలు పడే సూచనలున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ జిల్లాల కోసం ఎల్లో అలర్ట్‌ను జారీ చేసిన వాతావరణ శాఖ, సోమవారం, మంగళవారం పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.