'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. ఈ వ్యూహం ఎలా ఉండాలనే దానిపై చర్చించేందుకు ఈ నెల 23న భావసారూప్యత కలిగిన పార్టీలు పాట్నాలో సమావేశం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పోమొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 450 స్థానాల్లో 'వన్ ఆన్ వన్' ఫార్ములాతో ముందుకెళ్లాలని విపక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చేయడానికి ప్రతిపక్షాలు 'వన్ ఆన్ వన్' ఫార్ములాను ప్రతిపాదిస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై పాట్నా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
'వన్ ఆన్ వన్' వ్యూహం ఉద్దేశం ఇదే
'వన్ ఆన్ వన్' వ్యూహం అంటే, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నుంచి ఒక్కరు మాత్రమే పోటీలో నిలబడతారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 లోక్‌సభ స్థానాల్లో తాము బలంగా ఉన్నామని కాంగ్రెస్ నమ్ముతోంది. అలాగే యూపీలో ఎస్పీ, బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ కూటమి, పశ్చిమ్ బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే, జార్ఖండ్‌లో జేఎంఎం లాంటి ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థిపై బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ అభ్యర్థిని బరిలో దింపాలని ప్రతిపక్ష కూటమి ఆలోచిస్తోంది. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ తమ అభ్యర్థిని రంగంలోకి దించుతుంది. ఇలా చేయడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలవనే ఆలోచనలో ప్రతిపక్ష నేతలు ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి ఖర్గే, రాహుల్ హాజరు
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు పాట్నాలో సమావేశం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచన మేరకు పాట్నాలో నితీష్ కుమార్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్ష సమావేశానికి పాట్నా ముఖ్యమైన వేదికగా పరిగణించబడుతోంది. ఎందుకంటే ఇది తూర్పు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జై ప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో ఉద్యమం ఇక్కడి నుంచే మొదలైంది. అంతటి చరిత్ర ఉన్న పాట్నా ఇప్పుడు ప్రతిపక్ష రాజకీయాలకు కేంద్రంగా మారబోతోంది. ఈసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి మరో ఐక్యవేదికకు కేంద్రబిందువుగా మారుతోంది.