LOADING...
#NewsBytesExplainer: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు.. స్పీకర్ ముందున్న ఆప్షన్లు ఇవే!
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు.. స్పీకర్ ముందున్న ఆప్షన్లు ఇవే!

#NewsBytesExplainer: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు.. స్పీకర్ ముందున్న ఆప్షన్లు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపుగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఫిరాయింపు నేపథ్యంలో వచ్చిన ఈ కేసును రాజ్యాంగ వ్యవస్థల పరిధిలో జరిగే అంశంగా పేర్కొంటూ, న్యాయస్థానం సుదీర్ఘ వాదనలు విన్న తరువాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేయగా, తాజాగా దీని పరిణామంగా స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని పేర్కొంది. సంవత్సరాల తరబడి ఈ రకమైన పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడం సబబు కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేగాక, ఫిరాయింపు చట్టాన్ని తిరగవిశ్లేషించి పార్లమెంటు అందులో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీం అభిప్రాయపడింది.

వివరాలు 

3 నెలల తర్వాత ఉప ఎన్నికలు వస్తాయా? 

అనర్హతను న్యాయస్థానేమే విధించాలన్నఅభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తాజా తీర్పు ప్రకారం, స్పీకర్ అక్టోబర్ 31లోపు నిర్ణయం తీసుకోవాల్సిన నిబంధనకు లోబడి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై,ఉప ఎన్నికలు జరగనున్నాయా?లేక అలా జరగదా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు కేంద్రబిందువుగా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గుర్తుపై గెలిచిన 10మంది ఎమ్మెల్యేలు విడతలవారీగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. వీరి అనర్హతకు సంబంధించిన పిటిషన్లు ఇప్పటికీ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. వాటిపై విచారణ అనంతరం న్యాయస్థానం స్పష్టమైన తీర్పును వెలువరించింది. స్పీకర్ తప్పకుండా మూడు నెలల వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో,ఇప్పుడు స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిందే.

వివరాలు 

స్పీకర్‌ ముందు ఉన్న ఎంపికలు ఏమిటి? 

ఇప్పుడు స్పీకర్ ఆ పదిమందిని అనర్హులుగా ప్రకటిస్తే ఉప ఎన్నికల తాలూకు ప్రక్రియ ప్రారంభమవుతుంది. లేదంటే, వాటిని నిరాకరిస్తే ఉప ఎన్నికల అవసరం ఉండదు. ఇది పూర్తిగా స్పీకర్ నిర్ణయంపై ఆధారపడిన విషయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, మూడు నెలల వ్యవధిలో స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించాలి. ఆ నిర్ణయం అనర్హత విధించే విధంగా ఉండవచ్చు, లేక అనర్హతను అమలు చేయకుండా ఉండవచ్చు - రెండూ స్పీకర్ స్వేచ్ఛతో ఉండే ఎంపికలే. అయినప్పటికీ, నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. ఇదే సమయంలో, స్పీకర్ కూడా సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

స్పీకర్‌ ముందు ఉన్న ఎంపికలు ఏమిటి? 

గతంలో ఇటువంటి పిటిషన్లపై నిర్ణీత గడువులోగా నిర్ణయాలు వచ్చిన సందర్భాలు చాలా అరుదు. తాజాగా వచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ న్యాయ నిపుణులతో చర్చలు నిర్వహించారు. ఇప్పటికే పలు నోటీసులు జారీ చేశామని స్పీకర్ వెల్లడించారు. అయితే ఆయన తుది నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? 

అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వీరిలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన దానం నాగేందర్‌తో పాటు మిగతా తొమ్మిది మందిపై బీఆర్ఎస్ ఫిర్యాదులు దాఖలు చేసింది. తమ అభివృద్ధి పనుల కోసం మాత్రమే సీఎం వద్దకు వెళ్లామని, బీఆర్ఎస్‌లోనే ఉన్నామని వారు స్పష్టంగా ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా, సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులకు వారు తమను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పేర్కొంటూ అఫిడవిట్లు దాఖలు చేశారు. మీడియా సమావేశాల్లో కూడా అదే అభిప్రాయం తెలిపారు. ఇప్పటికే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇవ్వాల్సిన సమయం దగ్గరపడుతోంది.

వివరాలు 

ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? 

కండువా కప్పినంత మాత్రాన పార్టీలో చేరినట్టు ఎలా అంటారని వారు వాదించే అవకాశముంది. తమపై ఆధారాలు చూపాలంటే మీడియా ప్రకటనలతో పాటు ఇతర ఆధారాలను బీఆర్ఎస్ కూడా సమర్పించనుంది. రెండుపక్షాల వాదనలు విన్న అనంతరం స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య వెల్లడించారు. అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయితేనే ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు.

వివరాలు 

గత 10 ఏళ్లలో ఏం జరిగింది? 

తెలంగాణ రాజకీయ చరిత్రలో ఫిరాయింపులు కొత్తవి కావు. 2014లో టీడీపీ 15 స్థానాల్లో గెలిచి తర్వాత 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టారు. తర్వాత ఈ శాసనసభపక్షాన్ని బీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు లేఖలు రాశారు. అప్పటి స్పీకర్ దీనిని అధికారికంగా గుర్తించారు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రిపదవి ఇవ్వడం జరిగింది. అప్పట్లో టీడీపీ తరపున ఉన్న రేవంత్ రెడ్డి దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. కానీ అనంతరం రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత టీడీపీకి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.

వివరాలు 

గత 10 ఏళ్లలో ఏం జరిగింది? 

బీఎస్పీ తరపున గెలిచిన కొంతమంది కూడా బీఆర్ఎస్‌లో విలీనం అయ్యారు. 2018లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడంతో, కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా నియమితులయ్యారు. ఫిరాయింపులపై అప్పటికీ కాంగ్రెస్ ఫిర్యాదులు చేసినా, స్పష్టమైన నిర్ణయాలు లేకుండానే వ్యవహారం ముగిసిపోయింది. తాజా తీర్పు నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి..