Loading...
AAI: తిరుపతి,తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టులు ప్రైవేటుకు.. ఏఏఐ కీలక నిర్ణయం
తిరుపతి,తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టులు ప్రైవేటుకు.. ఏఏఐ కీలక నిర్ణయం

AAI: తిరుపతి,తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టులు ప్రైవేటుకు.. ఏఏఐ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటు ఆపరేటర్‌కు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంతో తిరుపతి విమానాశ్రయాన్ని బండ్లింగ్‌ చేసి ప్రైవేటు సంస్థకు నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలు అప్పగించనుంది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) పరిధిలోని 11 విమానాశ్రయాలను ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏఏఐ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (EoI) జారీ చేసింది. విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవాలని ఏఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా రిటైల్‌, కార్గో, వాణిజ్య కార్యకలాపాలను విస్తరించడం ద్వారా ఆదాయ వనరులను పెంచాలని భావిస్తోంది.

వివరాలు 

రెండు విమానాశ్రయాలను తొలిసారి బండ్లింగ్‌..

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ (పీపీపీఏసీ) ఇటీవల నిర్వహించిన సమావేశంలో తొలిసారిగా రెండు విమానాశ్రయాలను బండ్లింగ్‌ చేసి ప్రైవేటుకు అప్పగించే విధానానికి నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా అధిక రద్దీ ఉన్న విమానాశ్రయాన్ని తక్కువ రద్దీ ఉన్న మరో విమానాశ్రయంతో కలిపి ఒక బండిల్‌గా రూపొందించాలని నిర్ణయించింది.

11 విమానాశ్రయాలను ఐదు బండిల్స్‌గా విభజించి లీజుకు ఇవ్వాలన్న పౌర విమానయాన శాఖ ప్రతిపాదనకు పీపీపీఏసీ ఆమోదం తెలిపింది.

గతంలో 2020లో అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, మంగళూరు, గువాహటీ, తిరువనంతపురం విమానాశ్రయాల నిర్వహణను ఏఏఐ ప్రైవేటు సంస్థలకు అప్పగించింది.

అయితే ఇప్పుడు తొలిసారిగా బండ్లింగ్‌ విధానంలో విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించనుంది.

వివరాలు 

తిరుపతి ప్రైవేటుకు ఎందుకంటే?

తిరుమలకు వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతోంది.

ప్రస్తుతం తిరుపతి నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం నగరాలకు కూడా ప్రతిరోజూ విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి.

విమానాశ్రయాల బండ్లింగ్‌ నిర్ణయంలో ప్రయాణికుల రద్దీ, భూమి లభ్యత, వాణిజ్య అవకాశాలు, ఆర్థిక పనితీరు, ప్రత్యేక సదుపాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

డేటా ఆధారిత విశ్లేషణ ద్వారా విమానాశ్రయాలను జత చేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది.

ADVERTISEMENT

వివరాలు 

తిరుపతి-తిరుచిరాపల్లి జతతో ప్రయోజనాలపై అంచనాలు..

తిరుపతి విమానాశ్రయాన్ని తిరుచిరాపల్లి విమానాశ్రయంతో కలిపి బండిల్‌గా అప్పగించడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నిర్వహణ సామర్థ్యం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.

అలాగే రెండు విమానాశ్రయాల్లో వాణిజ్య కార్యకలాపాలను వేగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది.

అధిక రద్దీ ఉన్న విమానాశ్రయాలకే సాధారణంగా వాణిజ్యపరమైన వయబిలిటీ ఎక్కువగా ఉంటుంది.

అలాంటి విమానాశ్రయాలతో తక్కువ రద్దీ ఉన్న విమానాశ్రయాలను బండ్లింగ్‌ చేయడం ద్వారా వాటి వయబిలిటీని పెంచాలన్నది కేంద్రం ఉద్దేశం.

ప్రయాణికుల రద్దీ పెరిగే కొద్దీ అవసరమైన అభివృద్ధి పనులను ప్రైవేటు సంస్థ చేపట్టాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

భవిష్యత్తులో కడప, రాజమహేంద్రవరం కూడా..

రాష్ట్రంలో ప్రస్తుతం ఏఏఐ నిర్వహణలో ఉన్న కడప, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను కూడా భవిష్యత్తులో బండ్లింగ్‌ విధానంలో ప్రైవేటుకు అప్పగించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రూ.173.28 కోట్లతో చేపట్టిన దేశీయ టెర్మినల్‌, ఇతర మౌలిక సదుపాయాల పనులు దాదాపు పూర్తయ్యాయి.

కడప విమానాశ్రయంలో రూ.210.61 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఇప్పటివరకు సుమారు 70 శాతం పూర్తయ్యాయి.

ఈ రెండు విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు, ప్రయాణికుల రద్దీ పెరిగిన తర్వాత బండ్లింగ్‌ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ADVERTISEMENT