
Pakistani Nationals: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..
ఈ వార్తాకథనం ఏంటి
కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం తారాస్థాయికి చేరింది.
ఈ పరిస్థితుల్లో భారత్‌లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే, నిర్దేశిత గడువు లోపల పాకిస్తాన్ పౌరులు భారత్‌ను వదిలి వెళ్లాలని ఆదేశించింది.
పాకిస్తాన్ పౌరులు భారత్‌ను వీడేందుకు ఇవాళ అంటే ఏప్రిల్ 29 చివరి రోజు కాగా, మెడికల్ వీసాలతో దేశంలో ఉన్న వారికీ ఇదే గడువు వర్తించనుంది.
వారు దేశం విడిచిపెట్టకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో భారతదేశం నలుమూలలా ఉన్న పాక్ పౌరులు తమ స్వదేశానికి తిరుగుతున్నారు.
వివరాలు
పాక్ పౌరులను పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు
ఈ క్రమంలో, కేంద్రం ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్‌లో నమోదు అయిన పాకిస్తాన్ పౌరుల వివరాలను అధికారులు పూర్తిగా పరిశీలించారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రంలో ఉన్న పాక్ పౌరులను పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులు గడువులోగా తమ దేశానికి వెళ్లాలని, లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇప్పటికే హైదరాబాద్‌ను నలుగురు పాకిస్తానీయులు వదిలి వెళ్లారు. వారిలో ఒక పురుషుడు, ఒక మహిళ, ఆమె కుమార్తెతో పాటు మరో మహిళ కూడా ఉన్నారు.