AP Budget 2025: ఇవాళ ఏపీ బడ్జెట్.. వ్యవసాయం, విద్య, వైద్యం రంగాలకు భారీ కేటాయింపులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మొదటి పూర్తిస్థాయి బడ్జెట్. సుమారు రూ.3.24 లక్షల కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం.
ఈసారి బడ్జెట్‌లో ముఖ్యంగా 'సూపర్ సిక్స్' హామీల అమలుకు అధిక ప్రాధాన్యతనిచ్చారు.
అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ఆంధ్రాలోని కరవు, మెట్ట ప్రాంతాల్లో సాగు, తాగునీరు అందించేందుకు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ మొత్తం రూ.3.24 లక్షల కోట్లతో రూపొందించినట్లు తెలుస్తోంది.
Details
తల్లికి వందనం పథకాలకు కేటాయింపు
గత జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువును మొదట మూడు నెలలు పొడిగించారు.
అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత నవంబరులో రూ.2.94 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకటించగా, తాజా బడ్జెట్ దాదాపు 10% పెరుగుదలతో రూపుదిద్దుకుంది.
ఈసారి బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చేశారు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకూ నిధులు కేటాయించారు. 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు తెలుస్తోంది.
Details
అసెంబ్లీలో పయ్యావుల.. మండలిలో కొల్లు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ఆధారంగా అమలు చేయనున్నట్లు సమాచారం.
పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లను నిర్మించి పంపిణీ చేయడానికి నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమరావతి, పోలవరంతో పాటు వెలిగొండ, వంశధార, హంద్రీనీవా ప్రాజెక్టులకు కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మంత్రి కొల్లు రవీంద్ర శాసనమండలిలో బడ్జెట్‌ను సమర్పిస్తారు.
వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో అచ్చెన్నా యుడు, మండలిలో నారాయణ ప్రవేశపెడతారు.
Details
స్వయం ఉపాధి పనులకు ప్రాధాన్యత
ఈసారి బడ్జెట్‌లో విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు భారీగా నిధులు కేటాయించారు.
రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, చిన్న రైతులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నారు.
వైద్యరంగంలో కేంద్ర ప్రభుత్వం నుండి కొన్ని పథకాల సహాయాన్ని కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం రాష్ట్రం 40% వాటా నిధులను కేటాయించింది.
ఈ పథకాలు అమలైనట్లయితే జీఎస్టీ రూపంలో ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లతో పాటు స్వయం ఉపాధి పథకాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు.
Details
అన్నదాత సుఖీభవకు నిధులు
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20వేల ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో కేంద్రం రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేల వరకు అందించనుంది. దీపం పథకం కింద ఏటా మూడు ఉచిత సిలిండర్లు అందించేందుకు కూడా నిధులు కేటాయించారు.
క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం
శుక్రవారం ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు.
మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తర్వాత వ్యవసాయ రంగ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు.
ఈ ఏడాది వ్యవసాయ రంగానికి దాదాపు రూ.50 వేల కోట్ల నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది.
Details
పెన్ డ్రైవ్ బడ్జెట్
ఈసారి ఏపీ ప్రభుత్వం 'ఈ-బడ్జెట్' విధానాన్ని అమలు చేయనుంది. మంత్రులకు ట్యాబ్‌లలో బడ్జెట్‌ను అందించనున్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియాకు పెన్ డ్రైవ్ రూపంలో బడ్జెట్‌ను అందజేస్తారు. సభ్యులకు ప్రసంగ పుస్తకాలను మాత్రమే ముద్రించి అందిస్తారు.
గతంలో ముద్రించేవారు 28 రకాల పుస్తకాలను రద్దు చేసి ఖర్చులను తగ్గించే చర్యలు తీసుకున్నారు.