
Steve Hanke: ట్రంప్ తనను తానే నాశనం చేసుకుంటున్నారు.. భారత్‌పై టారిఫ్‌లు నిలవవు: అమెరికన్ ఆర్థికవేత్త
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌పై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తనకే నష్టం చేసుకుంటున్నారని అమెరికాలో ప్రముఖ ఆర్థిక నిపుణుడు, జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రపంచ దేశాలపై ఏకపక్షంగా టారిఫ్‌లు విధించడం వెనుక ఎలాంటి ఆర్థిక సార్ధకతలేదని, ట్రంప్ అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు పూర్తిగా తప్పు దారిలో నడుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భారత ఉత్పత్తులపై ట్రంప్ పెంచిన దిగుమతి సుంకాలను హాంకే "నిరర్థకమైన, స్థిరత్వం లేని నిర్ణయం"గా అభివర్ణించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన,"నెపోలియన్ చెప్పినట్లు,శత్రువు తనను తానే కూలదోసుకుంటున్నప్పుడు జోక్యం చేసుకోవద్దు.ప్రస్తుతం ట్రంప్ అదే చేస్తున్న పరిస్థితి" అని అన్నారు.
వివరాలు
భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించిన అమెరికా
ట్రంప్ ఆర్థిక నిర్మాణం త్వరలోనే కూలిపోవడం ఖాయమని, అందువల్ల ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ ఓర్పుతో ఎదురుచూడడం మంచిదని సూచించారు. రష్యా నుండి భారత్ నిరంతరం చమురు దిగుమతి కొనసాగిస్తున్నదనే కారణంతో, అమెరికా మొదట 25% టారిఫ్ విధించింది. అనంతరం మరో 25% పెంచి, మొత్తం 50% స్థాయికి చేర్చింది. ఈ విధానం వల్ల బ్రెజిల్‌తో పాటు భారత్ కూడా అమెరికా నుంచి గరిష్ట టారిఫ్‌లకు గురవుతున్న దేశాల జాబితాలో చేరింది. అమెరికా ఈ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది 'అసమంజసమైన, అన్యాయపూర్వక' నిర్ణయమని పేర్కొంటూ, టెక్స్‌టైల్, సముద్ర ఉత్పత్తులు, తోలు పరిశ్రమ వంటి అనేక రంగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాలు
ఒత్తిళ్లకు లొంగేది లేదని స్పష్టం చేసిన భారత ప్రభుత్వం
ఆర్థిక ఒత్తిళ్లకు తలొగ్గే ఉద్దేశ్యం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మరోవైపు, రష్యా, చైనా కూడా అమెరికా ఈ ఒత్తిడి విధానాన్ని తప్పుబడుతూ ట్రంప్‌పై విమర్శలు గుప్పించాయి. అయితే, ట్రంప్ ఈ విమర్శలను కొట్టిపారేశారు. టారిఫ్‌ల వల్ల అమెరికా ఖజానాకు వందల బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందని, స్టాక్ మార్కెట్‌పై కూడా మంచి ప్రభావం చూపుతోందని ఆయన 'ట్రూత్ సోషల్' ద్వారా తెలిపారు. అలాగే, టారిఫ్ వివాదం సద్దుమణిగే వరకు భారత్‌తో వాణిజ్య చర్చలు జరగబోవని స్పష్టంగా ప్రకటించారు.