తెలంగాణలో వచ్చే 3రోజులు భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణలో రానున్న 3 రోజులు వానలు దంచికొట్టనున్నాయి. ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు సమారు 20 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తనం కేంద్రీకృతమైనందున దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించింది. ఉత్తర బంగాళాఖాతం వద్ద 3న మరో ఆవర్తనం ఏర్పడనుంది. దీంతో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. శనివారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, కామారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, ములుగు, జనగాం, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి.