
Heavy Rains in Telangana: భారీ వర్షాల ప్రభావంతో తెలంగాణలో ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, తెలంగాణలోని ఐదు జిల్లాల్లో పాఠశాలలకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలల్లో అయితే ఈ రెండు రోజులు ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో, వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్‌ఛార్జ్ మంత్రులు, సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వివరాలు
అన్ని శాఖల ఉద్యోగులకూ సెలవులు రద్దు
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకూ సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. అకస్మాత్తుగా వరదలు తలెత్తిన సందర్భంలో తక్షణ సహాయ చర్యల కోసం హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. హైదరాబాద్‌లో వరద ముప్పు ఉన్న ప్రాంతాలపై హైడ్రా అప్రమత్తతతో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అదనంగా, ఐటీ సంస్థల ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.