Anmol Bishnoi: యూఎస్‌లో అన్మోల్ బిష్ణోయ్ ను ఏ నేరానికి అరెస్ట్ చేశారు?
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా పోలీసులు కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అనంతరం అతడిని ఐవోవాలోని పొట్టావట్టమీ కౌంటీ జైలుకు తరలించారు. అన్మోల్ బిష్ణోయ్ అక్రమ పత్రాలతో అమెరికాలోకి ప్రవేశించాడన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం అమెరికా ప్రభుత్వం ద్వారా భారత ప్రభుత్వానికి కూడా తెలియజేశారు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇప్పటికే అమెరికాలోని ఎఫ్‌బీఐ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగాలతో సంప్రదింపులు జరుపుతోంది. అన్మోల్‌ను భారత్‌కు అప్పగించాలని ఎన్‌ఐఏ కోరినా, అతడిపై యూఎస్‌లో నమోదైన కేసులు భారత కేసులకు సంబంధించి కాకపోవడం వల్ల అప్పగింపు అవకాశాలు ప్రస్తుతం కష్టసాధ్యంగా కనిపిస్తున్నాయి.
భారత్ లో అన్మోల్ బిష్ణోయ్ పై ఆరోపణలు
అన్మోల్ బిష్ణోయ్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య వంటి అనేక తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పుల ఘటనకు సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో అన్మోల్ ఒక పోస్ట్ పెట్టాడు, దీనివల్ల అతనిపై ఆరోపణలు మరింత బలపడ్డాయి. అతను నకిలీ పాస్‌పోర్ట్ ద్వారా భారత్ నుంచి పారిపోయి కెనడా, అమెరికా మధ్య తరచుగా ప్రయాణిస్తుండేవాడని భావిస్తున్నారు. ఎన్‌ఐఏ, భారత యాంటీ టెర్రర్ యూనిట్‌ల కేసుల్లో అన్మోల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
ఎన్‌ఐఏ చర్యలు
ఎన్‌ఐఏ అన్మోల్ బిష్ణోయ్ కోసం రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అతడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేయబడింది. అదనంగా, మనీ లాండరింగ్ కేసులో ఈడీ కూడా అతడి పై దర్యాప్తు చేస్తోంది. సిద్ధిఖీ హత్యకు ముందు అన్మోల్ షూటర్లతో చాటింగ్ చేశాడని ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అన్మోల్ గురించి సమాచారం అందించిన వారికి రివార్డు ఇస్తామని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ప్రస్తుతం అతడిని భారత్‌కు తీసుకురావడం ఎంతవరకు సాధ్యమవుతుందో అనేది అమెరికా, భారత్ ప్రభుత్వాల మధ్య ఉన్న చర్చలపై ఆధారపడి ఉంది.