
New Flight Services: విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసు.. జూన్ 1 నుంచి సేవలు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణం ఆర్థిక రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, విజయవాడ-విశాఖపట్నం మధ్య రవాణా అవసరాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
అయితే ఈ రెండు నగరాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో రోడ్ మార్గంలో ప్రయాణించడానికి అధిక సమయం తీసుకుంటోంది.
అంతేకాకుండా,విశాఖపట్నానికి నేరుగా విమాన సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర పౌర విమానయాన శాఖ విజయవాడ నుంచి నేరుగా విశాఖపట్నానికి విమాన సర్వీసు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం చెన్నై నుంచి వచ్చే ఒకే ఒక్క విమానం మాత్రమే ఈ మార్గంలో అందుబాటులో ఉంది.
కానీ, దానిలో ఎక్కువగా రద్దీ ఉండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలైన హైదరాబాద్ ద్వారా ప్రయాణిస్తున్నారు.
వివరాలు
ఈ సేవను ఇండిగో సంస్థ నిర్వహిస్తోంది
ఇకపై నేరుగా విశాఖకు వెళ్లే విమాన సర్వీసు ప్రారంభం కాబోతుండటంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రకటనలో జూన్ 1 నుంచి ఈ కొత్త విమాన సర్వీసు ప్రారంభమవుతుందని తెలిపారు.
ఇండిగో సంస్థ ఈ సేవను నిర్వహించనుంది. ఉదయం 7:15 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరిన విమానం, 8:25 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
తిరిగి ఉదయం 8:45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి, 9:45 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.
వివరాలు
విజయవాడ-విశాఖ మార్గంలో ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం
ఈ నూతన సర్వీసుతో విజయవాడ-విశాఖ మార్గంలో ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం కలుగనుంది.
ఇంతకు ముందు చెన్నై నుంచి మాత్రమే విశాఖకు వెళ్లే విమాన సర్వీసు ఉండగా, అది ఉదయం 8:05కు విజయవాడకు చేరి, 8:45కు విశాఖ వైపు బయలుదేరేది.
కానీ, చెన్నై విమానంలో ఉన్న రద్దీ కారణంగా ప్రయాణికులు హైదరాబాద్ ద్వారా ప్రయాణించాల్సి వచ్చేది.
ఇప్పుడు నేరుగా విమాన సర్వీసు ప్రారంభమవుతున్నందున ఈ ఇబ్బందులు తొలగిపోతాయని వారు భావిస్తున్నారు.
ఇకపై విజయవాడ నుంచి ఉదయం విశాఖకు వెళ్లి తమ పనులు ముగించుకుని, రాత్రికి తిరిగి విజయవాడ చేరుకునే వీలుండబోతోంది.
వివరాలు
విమాన సర్వీసు సామాన్య ప్రజలతో పాటు వ్యాపార వర్గాలకూ ఉపయోగం
ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.
జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ఇండిగో విమాన సర్వీసును ప్రారంభించేందుకు కృషి చేసిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విమాన సర్వీసు సామాన్య ప్రజలతో పాటు వ్యాపార వర్గాలకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇలాంటి మరిన్ని విమాన సర్వీసులు భవిష్యత్తులో కూడా ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్
విశాఖ నుంచి విజయవాడకు ఉదయం వేళల్లో విమానాన్ని పునరుద్ధరిస్తూ తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర వాసులకు ఊరటనిచ్చే విషయం. జూన్ 1 వ తేదీ నుంచి ఇండిగో సర్వీసు మళ్లీ ప్రవేశపెట్టడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి @RamMNK గారు పూనుకోవడం సంతోషం. ఆయనకు అభినందనలు. ప్రయాణికులకు అనుకూలంగా… pic.twitter.com/efTRgr9P7L
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) May 5, 2025