
Vizianagaram: ఐఈడీ సిద్ధం చేస్తుండగా సిరాజ్ అరెస్ట్.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న విజయనగరంలో ఇప్పుడు కలవరపాటు వాతావరణం నెలకొంది.
శనివారం నాడు పేలుడు పదార్థాలు, పీవీసీ పైపు ముక్కలు,ఇతర అవసరమైన సామగ్రితో ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) తయారీకి ప్రయత్నిస్తున్న సమయంలో, ఉగ్రవాద భావజాలం కలిగిన సిరాజ్‌పై పోలీసులు మెరుపుదాడి నిర్వహించి అతన్ని అరెస్టు చేశారు.
ఈ విషయాన్ని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
వివరాలు
బ్యాగ్‌తో అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడిన సిరాజ్
విజయనగరం విజ్జీ స్టేడియానికి వెళ్లే మార్గంలోని రాజానగర్ వద్ద, మోటార్‌సైకిల్‌పై పేలుడు పదార్థాలు,ఇతర అనుమానాస్పద వస్తువులతో ఉన్నబ్యాగ్‌తో మోటారుసైకిల్‌పై సిరాజ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు.
జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఐఈడీ పేల్చాలని ఉద్దేశంతో వచ్చానని విచారణలో వెల్లడించాడు.
ఆన్‌లైన్ ద్వారా పేలుడు పదార్థాలను ఏప్రిల్ 20, 26, 30 తేదీలలో ఆర్డర్ చేసినట్టు గుర్తించారు. వాటి డెలివరీ విజయనగరంలోని ఓ ఉర్దూ పాఠశాల చిరునామాకు వెళ్లినట్లు గుర్తించారు.
సిరాజ్ వద్ద ఉన్న రెండు సిమ్ నంబర్లతో కూడిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పాస్‌వర్డ్ అడిగి ఫోన్‌ను ఓపెన్ చేయించి పరిశీలించగా,అందులో వాట్సాప్,ఇన్‌స్టాగ్రామ్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి అప్లికేషన్లు ఉన్నట్లు వెల్లడైంది.
వివరాలు
కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
ఈ యాప్‌ల ద్వారా సిరాజ్‌తో పాటు సమీర్ పేలుడు పదార్థాల కొనుగోలు, వినియోగం గురించి చర్చించిన చాటింగ్‌లను పోలీసులు గమనించారు.
సిరాజ్,సమీర్‌లను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయనగరం రెండో పట్టణ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయాధికారి తీర్పును రిజర్వు చేశారు.
బుధవారం నాటికి తీర్పు వెలువడే అవకాశం ఉంది. పోలీసులు ఈ కేసులో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం నిందితులను పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని వాదించారు.
వివరాలు
విజయనగరంలోనే ఎన్ఐఏ బృందం మకాం
ఈ కేసు నేపథ్యంపై మరింత సమాచారం సేకరించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారుల బృందం విజయనగరంలో మకాం వేసింది.
దాదాపు పదిమంది అధికారులు విభాగాలుగా విడిపోయి ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
సిరాజ్ అంగీకారంతో కీలక ఆధారాలు
పోలీసుల విచారణలో సిరాజ్ తన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. అతని వద్ద ఉన్న మోటార్‌సైకిల్‌తో పాటు పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా, సౌదీ అరేబియాలో ఉన్న అబూత్ ఆలెం అలియాస్ అబూ ముసాబ్ అనే వ్యక్తి, సిరాజ్‌తో పాటు సమీర్‌కు సిగ్నల్ యాప్ ద్వారా తరచూ ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నాడని సిరాజ్ చెప్పినట్టు సమాచారం.
వివరాలు
పోలీసుల అదుపులో వ్యాపారులు..
కన్యకాపరమేశ్వరి కోవెల ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం రోజున రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న విషయాన్ని అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.
ఇటీవల ఉగ్రవాద సంబంధాల నేపథ్యంలో అరెస్టైన ఇద్దరికి పేలుడు పదార్థాల సరఫరా చేసిన అంశంలో విచారణ నిమిత్తం వారిని స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం.