
Rains in Telugu States: రెయిన్ అలెర్ట్.. నేడు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
వాయుగుండం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శ్రీకాకుళం,మన్యం,విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని,ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది.
అలాగే, విశాఖపట్టణం,అల్లూరి,అనకాపల్లి,కాకినాడ,యానాం ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగం ఉండొచ్చని తెలిపింది.
కళింగపట్నం, భీమినిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
వివరాలు
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ముఖ్యంగా కుమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సోమవారం కూడా కుమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.