Page Loader
LORA: 'లోరా' ప్రత్యేకత ఏమిటి..? బ్రహ్మోస్ ఉన్నా కూడా భారతదేశం ఈ ఆయుధంపై ఎందుకు ఆసక్తి చూపుతోంది?
బ్రహ్మోస్ ఉన్నా కూడా భారతదేశం ఈ ఆయుధంపై ఎందుకు ఆసక్తి చూపుతోంది?

LORA: 'లోరా' ప్రత్యేకత ఏమిటి..? బ్రహ్మోస్ ఉన్నా కూడా భారతదేశం ఈ ఆయుధంపై ఎందుకు ఆసక్తి చూపుతోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వినియోగించిన ''బ్రహ్మోస్ క్షిపణి'' ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రత్యేకంగా పాకిస్థాన్‌కు ఇది గట్టి హెచ్చరికగా మారింది. తాజాగా, భారత్ మరొక శక్తివంతమైన క్షిపణిని సొంతం చేసుకునేందుకు యత్నిస్తోంది. ఇది పాకిస్తాన్, చైనాలకు భారీ భయాందోళన కలిగించేలా ఉండబోతోంది. ఇజ్రాయెల్ నుంచి ''లోరా (LORA)'' క్షిపణిని కొనుగోలు చేసేందుకు భారత్ యోచిస్తోంది. ఈ క్షిపణిని సుఖోయ్-30 MKI వంటి యుద్ధవిమానాలకు అనుసంధానం చేయాలని భారత్ యోచిస్తోంది. లోరా అంటే లాంగ్ రేంజ్ ఆర్టిలరీ. ఇది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) రూపొందించిన సూపర్‌సోనిక్ సెమీ-బాలిస్టిక్ క్షిపణి. గాలి నుంచి ప్రయోగించే సామర్థ్యంతో ఇది రూపుదిద్దుకుంది. 400-430 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ధ్వంసం చేయగలదు.

వివరాలు 

LORA క్షిపణి ప్రత్యేకతలు 

ఈ LORA క్షిపణిని సుఖోయ్-30 MKI తరహా యుద్ధ విమానాల నుంచి ప్రయోగించేలా రూపొందించారు. దాని వేగం కారణంగా, దాన్ని శత్రు దేశాలు గుర్తించి తిప్పికొట్టడం చాలా కష్టమైన పని. ఇది ''లాంచ్ అండ్ ఫర్గెట్'' విధానంతో పనిచేస్తుంది. గమ్యస్థానాన్ని లక్ష్యంగా చేసుకుని సొంతంగా దాడి నిర్వహించగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. లోరా క్షిపణి గరిష్ట పరిధి 400-430 కిలోమీటర్లు. దీని ద్వారా పాకిస్తాన్,చైనా దేశాల్లోని అనేక కీలక ప్రాంతాలను టార్గెట్ చేయవచ్చు. గరిష్ట వేగం గంటకు 6,147 కిలోమీటర్లు. టార్గెట్‌ను 10 మీటర్ల లోపలే అత్యంత ఖచ్చితంగా ఛేదించగలదు. శత్రుదేశాల్లోని కమాండ్ సెంటర్లు,రాడార్ వ్యవస్థలు వంటి ప్రధాన లొకేషన్లను ధ్వంసం చేయడానికి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు.

వివరాలు 

LORA క్షిపణి ప్రత్యేకతలు 

5.2 మీటర్ల పొడవు ఉన్న ఈ క్షిపణి బరువు 1,600 కిలోలు. లక్ష్యాన్ని కనుగొనడానికి GPS, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ (INS) వంటి రెండు నావిగేషన్ వ్యవస్థలను ఈ క్షిపణిలో ఏర్పాటు చేశారు. అంతేగాక, యాంటీ-జామింగ్ వ్యవస్థను కలిగి ఉండడం వల్ల శత్రుదేశాల జామింగ్ టెక్నాలజీ నుంచి తప్పించుకుని లక్ష్యాన్ని ఛేదించగలదు. బంకర్లు, ఎయిర్ బేస్‌లు, నావల్ బేస్‌లు, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేసే సామర్థ్యం దీని ప్రత్యేకత. ఒక్కో సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్ నాలుగు లోరా క్షిపణులను మోసుకొని ప్రయోగించగలదు. అంటే ఒక్క విమానం నుంచే నాలుగు వేర్వేరు లక్ష్యాలను తాక్కొట్టే సామర్థ్యాన్ని ఈ క్షిపణి కలిగి ఉంది.

వివరాలు 

భారత్‌కు LORA మీద ఆసక్తి ఎందుకు? 

ప్రస్తుతం భారత్ వద్ద దీర్ఘపరిధిలో అత్యంత ఖచ్చితమైన దాడులకు వీలుగా ఉన్న కొన్ని క్షిపణులు ఉన్నాయి. వీటిలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ (300-500 కిలోమీటర్ల పరిధి), రాఫెల్ యుద్ధవిమానాలలో అమర్చిన SCALP-EG క్షిపణి (500 కిలోమీటర్ల పరిధి), ప్రలే షార్ట్-రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ (500 కిలోమీటర్ల పరిధి), రాంపేజ్ ఎయిర్ టు గ్రౌండ్ మిస్సైల్ ఉన్నాయి. అయితే భారత వాయుసేన తన దాడి సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని యోచిస్తోంది. దీనికోసం ఇజ్రాయిల్ సహకారంతో దేశీయంగా LORA క్షిపణిని తయారు చేయాలని భావిస్తోంది. బ్రహ్మోస్ క్షిపణి తక్కువ ఎత్తులో ప్రయాణించి, శత్రుదేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లోకి చొచ్చుకుపోయే విధంగా పనిచేస్తుంది. సముద్ర మట్టానికి దగ్గరగా వెళ్లడం వల్ల దీనిని ఆపడం చాలా కష్టం.

వివరాలు 

భారత్‌కు LORA మీద ఆసక్తి ఎందుకు? 

ఇదిలా ఉంటే, లోరా క్షిపణి క్వాసీ-బాలిస్టిక్ మిస్సైల్ కావడం దీని ప్రత్యేకత. దీనిని గరిష్ట ఎత్తుకు ప్రయోగించి పై నుండి దాడి చేసే విధంగా ఉపయోగించవచ్చు. దాని కారణంగా శత్రుదేశాల రాడార్‌లకు కనపడకుండా వెళ్లగలదు. 430 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. బ్రహ్మోస్ క్షిపణిని భారత్-రష్యా కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది ధరలో ఖరీదైనది. ఒక్క బ్రహ్మోస్ యూనిట్ ధర రూ. 20 నుంచి 30 కోట్ల మధ్య ఉండగా, లోరా క్షిపణి తక్కువ ఖర్చుతో తయారవుతుంది. ఇది ఎగుమతి చేసే అవకాశాలు కూడా ఉన్న క్షిపణి. లోరా ద్వారా భారత్ తన ఆయుధ ఎగుమతి సామర్థ్యాన్ని కూడా పెంచుకునే అవకాశాన్ని చూస్తోంది.