Ex-RG Kar principal Sandip Ghosh: మాజీ RG కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై అవినీతి కేసు ఏమిటి?
పశ్చిమ బెంగాల్ లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. ఆర్థిక అవకతవకల సంబంధిత కేసులో ఈ చర్య తీసుకున్నారు. డాక్టర్ సందీప్‌ను గతంలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ 15వ తేదీన ప్రశ్నించి, తర్వాత కోల్‌కతాలోని నిజాం ప్యాలెస్ ఆఫీసుకు తీసుకెళ్లింది. అక్కడ ఆయనను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కొంతకాలంగా కోల్‌కతా వైద్యురాలికి సంబంధించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో పనిచేస్తున్న 31 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన నైట్ డ్యూటీ సమయంలో సెమినార్ హాలులో జరిగింది.
సందీప్ కి పాలిగ్రాఫ్ టెస్టు
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం,కోల్‌కతా పోలీసులు ఈ కేసును సరైన రీతిలో విచారించలేకపోయారని, అందుకే కోల్‌కతా హైకోర్టు సీబీఐకి ఈ కేసును అప్పగించింది. ఇప్పటికే సందీప్ ఘోష్‌పై విమర్శలు,ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ అతడిని పలుమార్లు విచారించిన తర్వాత, ఈ రోజు అరెస్ట్ చేసింది. అతడిపై ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ అధికారులు రెండు వారాల పాటు అతడిని ప్రశ్నించి సోమవారం సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పాలిగ్రాఫ్ టెస్టు కూడా నిర్వహించారు. సీబీఐ అతడిని ఆర్థిక అవకతవకలపై నేరపూరిత కుట్ర, మోసం, నిజాయితీ లేని చర్యల కోసం అరెస్ట్ చేసింది.
సందీప్ పై పలు ఆరోపణలు
ఈ కేసులు కాగ్నిజబుల్ నేరాలుగా, నాన్-బెయిలబుల్ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. డాక్టర్ సందీప్ 2021 ఫిబ్రవరి నుండి 2023 సెప్టెంబరు వరకు ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అతనిపై క్లెయిమ్ చేయని మృతదేహాలను చట్టవిరుద్ధంగా విక్రయించడం, బయోమెడికల్ వ్యర్థాలను అక్రమంగా రవాణా చేయడం, అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేందుకు విద్యార్థులపై లంచం ఇచ్చేందుకు ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్ 2023లో బదిలీ అయినప్పటికీ, కొద్దిరోజులకే తిరిగి పూర్వ స్థానానికి వచ్చారు. వైద్యురాలి ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా, డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై హత్యాచారం జరిగిన మూడు రోజులకు ఆగస్టు 12న ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు.
హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు అసహనం
ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమబెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేసినందుకు కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు చేశారని ప్రశ్నించింది. ఈ ఆలస్యం ఎందుకు జరిగిందని విచారించింది. వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారించింది. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, 10 మంది సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రిన్సిపల్ తీరుపై అభ్యంతరం
ఇంత ఘోరమైన ఘటన జరిగితే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏమి చేస్తున్నారని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. ప్రిన్సిపల్ ఎందుకు ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారనే విషయంలో కూడా విచారణ జరిగింది. ప్రిన్సిపల్ ప్రవర్తనపై సందేహాలు ఉన్నప్పటికీ, ఆయనను మరో కాలేజీలో ఎలా నియమించారో కూడా కోర్టు ప్రశ్నించింది. ఈ ఘటన సమయంలో ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌ను సీబీఐ మూడు రోజులుగా విచారిస్తోంది. సీబీఐ, గురువారానికి దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఆఫీసుల్లో మహిళల భద్రత గురించి పెరుగుతున్న ఆందోళనలపై పౌరులందరూ చర్చించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
'నైతిక విజయం'
సోమవారం లాల్‌బజార్ పోలీసు ప్రధాన కార్యాలయానికి నిరసన తెలిపిన రెసిడెంట్ వైద్యుల బృందం,ఘోష్ అరెస్టును"నైతిక విజయం"గా అభివర్ణించారు. ప్రొటెస్టింగ్ రెసిడెంట్,అనికేత్ మహతోను ది హిందూ ఉటంకిస్తూ,"మేము దీనిని నైతిక విజయంగా చూస్తున్నాము. ఇన్నిరోజులు మాకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ మా ధన్యవాదాలు"అని అన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం..TMC నాయకుడు,మాజీ రాజ్యసభ సభ్యుడు,డాక్టర్ శాంతాను సేన్ మాట్లాడుతూ.."నేను ఫిబ్రవరి 2023లో RG కర్ రోగి కళ్యాణ్ సమితి చైర్మన్‌గా చేరినప్పుడు,నేను అతనిపై ఉన్న అన్ని అవినీతి ఆరోపణల వివరాలను సేకరించే ప్రయత్నం చేశాను.. అంతేకాకుండా అతడిపై ఆరోగ్య శాఖ కార్యదర్శికి కూడా తెలియజేశాను కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకున్నట్లయితే, ఇంత ఘోరం జరిగుండేది కాదు"అని అన్నారు.
'నైతిక విజయం'
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ, "బెంగాల్ ప్రజలు అతడిని అరెస్టు చేయాలని కోరుకున్నారు... బెంగాల్ ప్రజల డిమాండ్‌ను సిబిఐ గౌరవించింది, అందుకే నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.