May Day 2023: భారత్‌లో 'మే డే'ను మొదట ఎక్కడ నిర్వహించారు? తొలిసారి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం( మే డే)ను ప్రతి సంవత్సరం మే 1న దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచంలోని అనేక దేశాలు మే డేను సెలవుదినంగా పాటిస్తారు. కార్మికుల త్యాగాలు, వారు సాధించిన విజయాలను స్మరించుకోవడంలో భాగంగా మే డేను జరుపుకుంటారు. కార్మిక ఉద్యమం 1886 మే 1న అమెరికా షికాగోలో ప్రారంభమైంది. కార్మికులతో రోజుకు దాదాపు 14గంటలకుపైగా పని చేయిస్తూ శ్రమదోపిడీ చేసేవారు. ఈ క్రమంలో పనిగంటలు తగ్గించాలని, ఇతర డిమాండ్లతో అమెరికా కార్మికులు తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కారు. ఈ ఉద్యమంలో భాగంగా కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు.
పారీస్‌లో అంతర్జాతీయ సోషలిస్టు సదస్సులో తీర్మానం
1886లో షికాగోలో ప్రారంభమైన కార్మిక ఉద్యమం తక్కువ వ్యవధిలోనే యూరప్‌లోని అన్ని దేశాల్లో విస్తరించింది. మూడేళ్ల తర్వాత అంటే 1889 జూలై 14న ఫ్రాన్స్‌లోని పారీస్‌లో అంతర్జాతీయ సోషలిస్టు సదస్సు జరిగింది. ఇందులో ప్రతి కూలీ నుంచి 8 గంటల పని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సదస్సులోనే మే 1న కార్మిక దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. మే 1వ తేదీన ఉద్యమం ప్రారంభం కావడంతోనే ఆ రోజునే కార్మిక దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. మొదటి కార్మిక దినోత్సవాన్ని 1890లో జరుపుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో కార్మికులపై విధించిన నియంత్రణలను తొలగించి కార్మికుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం మే 1న కార్మికుల దినోత్సవాన్ని అనేక దేశాలు అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించాయి.
భారత్లో తొలిసారి లేబర్ డే వేడుకలు ఎక్కడ జరిగాయంటే?
భారతదేశంలో కార్మిక దినోత్సవ వేడుకలు 1 మే 1923న చెన్నైలో ప్రారంభమయ్యాయి. లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఆధ్వర్యంలో తొలిసారి మే డే వేడుకలు జరిగాయి. తొలిసారి నిర్వహించిన వేడుకలకు పలు రాజకీయ పార్టీలు, కార్మీక సంఘాలు మద్దతు పలికాయి. భారత్‌లో మేడే ను లేబర్ డే అని కూడా పిలుస్తారు. హిందీలో 'కామ్‌గర్ దిన్' లేదా 'అంతర్రాష్ట్ర శ్రామిక్ దివాస్', తమిళంలో 'ఉజ్యోపలర్ నాల్', మరాఠీలో 'కామ్‌గర్ దివాస్' వంటి అనేక పేర్లతో పిలుస్తారు. మే డే రోజున దేశంలో అన్ని సంస్థలకు సెలవు ప్రకటిస్తారు. మే 1వ తేదీని మహారాష్ట్ర దినోత్సవంగా, గుజరాత్ దినోత్సవంగా కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.