Page Loader
Lawrence Bishnoi: బాలీవుడ్‌ను వణికిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ ఎవరు..? సల్మాన్ ఖాన్ ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు?
బాలీవుడ్‌ను వణికిస్తున్నలారెన్స్ బిష్ణోయ్ ఎవరు..? సల్మాన్ ఖాన్ ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు?

Lawrence Bishnoi: బాలీవుడ్‌ను వణికిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ ఎవరు..? సల్మాన్ ఖాన్ ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2024
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. 31 ఏళ్ల పంజాబీ గ్యాంగ్‌స్టర్ జైల్లో ఉన్నా, అతడి సోదరుడు, అనుచరుడు కెనడా నుండి గ్యాంగ్‌ను నడిపించడం ఆందోళనకరంగా మారింది.

వివరాలు 

కాలేజీలోనే నేరాలకు నాంది 

లారెన్స్ పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ జిల్లా ధత్తరన్‌వాలీ గ్రామానికి చెందిన సంపన్న కుటుంబానికి చెందినవాడు. అతడు బిష్ణోయ్‌ వర్గానికి చెందిన వ్యక్తి. ఈ వర్గం రాజస్థాన్, హరియాణ, పంజాబ్‌లో ఎక్కువగా ఉంటారు. లారెన్స్ 12వ తరగతి వరకు చదివాడు. ఆ తరువాత ఛండీగడ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ పరిధిలోని డీఏవీ కాలేజీలో చేరాడు. లారెన్స్ బిష్ణోయ్ జాతీయ స్థాయి అథ్లెట్, పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా కూడా వ్యవహరించాడు. ఇతడు న్యాయ విద్యను కూడా పూర్తి చేశాడు. ఆ తరువాత విద్యార్థి రాజకీయాల్లో గోల్డీ బ్రార్‌తో పరిచయం ఏర్పడింది. కొంత కాలం తర్వాత,మెల్లగా అతడు అసాంఘిక కార్యకలాపాలు ప్రారంభించాడు.

వివరాలు 

2018లో హత్యకు కుట్ర 

విద్యార్థి రాజకీయాలు ఇతనికి ముసుగుగా మారాయి. డీఏవీ కాలేజీ గ్యాంగ్‌వార్‌లో అతడి ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేసింది. ఈ ఘటనతో, అతడు పూర్తిగా నేరాల వైపు మళ్లినట్లు చెబుతుంటారు. 2018లో తన అనుచరుడు సంపత్ నెహ్రాతో కలిసి సినీ స్టార్ సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నడం ద్వారా జాతీయ స్థాయిలో వార్తలకెక్కాడు. ప్రస్తుతం బిష్ణోయ్ గ్యాంగ్‌లో అనేక ప్రొఫెషనల్ షూటర్లు ఉన్నారు. వీరి నెట్‌వర్క్ పంజాబ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలో విస్తరించింది. లారెన్స్‌ను చంపేందుకు దిల్లీలోని గ్యాంగ్‌స్టర్లు ఇంకా కాచుకు కూర్చోవడంతో, అతడిని వివిధ కేసుల్లో కోర్టుకు తరలించడం కూడా పోలీసులకు కత్తిమీద సాముగా మారింది.

వివరాలు 

గ్యాంగ్‌వార్‌లు, స్మగ్లింగ్

అతడు సబర్మతి జైల్లో ఉన్నా, తన గ్యాంగ్‌ను నిరాటంకంగా నిర్వహిస్తున్నాడు. అతడి సోదరుడు అన్మోల్, మిత్రుడు గోల్డీ బ్రార్‌లు ఈ వ్యవహారాలను చూసుకుంటున్నారు. గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరులో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. లారెన్స్ సన్నిహితుడు జస్విందర్‌ను గ్యాంగ్‌స్టర్ జైపాల్ భుల్లర్ హత్య చేశాడు. వాస్తవానికి, బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబ్‌లోని భరత్‌పుర్‌లో విస్తరించడానికి జస్విందర్ పనిచేశాడు. సిద్ధూ మూసేవాలా హత్యకు ఈ గ్యాంగ్‌ యుద్ధాలే కారణమని చెబుతారు. విక్కీ మధుఖేడా మరణానికి ప్రతీకారంగా, లారెన్స్ అనుచరులు ఈ పంజాబీ గాయకుడిని కాల్చిచంపారు. బిష్ణోయ్ గ్యాంగ్ సీమాంతర ఆయుధ స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల రవాణకు కూడా పాల్పడుతోందని గుజరాత్ ఏటీఎస్ ఆరోపించింది.

వివరాలు 

సల్మాన్‌కు బెదిరింపులు 

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడారు. ఈ కేసుకు సంబంధించి ఆయనపై న్యాయ విచారణ జరుగుతోంది. దాదాపు 2018 నుండి, సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ గ్యాంగ్ పనిచేస్తోంది. 2024 ఏప్రిల్‌లో బాలీవుడ్ స్టార్ ఇంటిపై కాల్పులు జరిపారు. అంతకు ముందే, అతడి ఫామ్ హౌస్‌ వద్ద రెక్కీలు నిర్వహించారు. దాదాపు 20 మందిని సల్మాన్‌పై దాడికి సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

వివరాలు 

జైల్లో నుంచే గ్యాంగ్‌ను ఎలా నడుపుతున్నాడు? 

లారెన్స్ బిష్ణోయ్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. కానీ, బ్యారక్‌ల్లో అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్‌లో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాంగ్ ప్రత్యర్థులకు కచ్చితమైన మెసేజ్‌లను పంపడానికి హత్యలకు పాల్పడుతుంటుంది. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీపై దాడులు ఈ కోవలోకి వస్తాయి. దీంతో, ఉత్తర భారతదేశంలోనే అత్యంత భయానక గ్యాంగ్‌గా పేరు తెచ్చుకుంది. ఈ గ్యాంగ్ సంపన్న వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి భారీగా సొమ్ములు వసూలు చేస్తుందని పేరు ఉంది. దిల్లీలోని అఫ్గాన్ జాతీయుడు నాదిర్ షా నుండి భారీగా డబ్బులు డిమాండ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా, ముంబైలో ఖాళీగా ఉన్న మాఫియా రాజ్యాన్ని ఆక్రమించడానికి ఇతడు యత్నిస్తున్నట్లు సమాచారం.