Page Loader
Delhi: జేపీ నడ్డా తర్వాత ఎవరు.. ఢిల్లీలో బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చ?
జేపీ నడ్డా తర్వాత ఎవరు.. ఢిల్లీలో బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చ?

Delhi: జేపీ నడ్డా తర్వాత ఎవరు.. ఢిల్లీలో బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చ?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలోని కేశవ్ కుంజ్‌లో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశాలు జరగనున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ నేతృత్వంలో 'మంతన్ బైఠక్' పేరుతో ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్దోత్సవాల కోసం రూపొందించాల్సిన ప్రణాళికలపై విస్తృతంగా చర్చించనున్నారు. అంతేగాక, సమాజంలో సామాజిక సమరసత సాధన కోసం చేపట్టిన 'పంచ్ పరివర్తన్' కార్యక్రమానికి దిశానిర్దేశం చేయనున్నారు. డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలపై కూడా మార్గదర్శకాలు రూపొందించబోతున్నారు. ఇక ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో ప్రత్యేక సమావేశాలకు కూడా ఆర్‌ఎస్‌ఎస్ సన్నాహాలు ప్రారంభించింది.

Details

దేశవ్యాప్తంగా నిర్మలా సీతారామన్ కు గుర్తింపు

ఈ క్రమంలోనే మరో కీలక అంశమైన బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగిసింది. దీంతో ఆయన స్థానంలో కొత్త నేతను ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈసారి అధ్యక్ష పదవిని మహిళకు ఇవ్వాలని ఆర్‌ఎస్‌ఎస్ సూచించినట్లు సమాచారం ఈ సూచనను బీజేపీ హైకమాండ్ కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెకు దేశవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉంది. వివిధ భాషలపై మంచి పట్టు కలిగి ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రచారం పరంగా ఆమెకు అవకాశం ఉంది.

Details

రేసులో పురందేశ్వరి

గతంలో రక్షణ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి సేవలందించిన నిర్మలాని తమిళనాడుకు చెందినవారిగా గుర్తించవచ్చు. త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఎంపిక పార్టీకి అనుకూలంగా ఉండొచ్చని భావిస్తున్నారు. దక్షిణాదిలో బీజేపీకి బలం పెంచాలన్న లక్ష్యంతో అక్కడి మహిళకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన కనిపిస్తోంది. ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ యోజనను దృష్టిలో ఉంచుకుని, బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకే ఇవ్వాలని భావిస్తున్నారు. సీతారామన్ పేరు ఫైనల్ కాకపోతే, రాజమండ్రి ఎంపీ దుగ్గుబాటి పురందేశ్వరి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆమెకు కూడా రాజకీయ అనుభవం, పార్టీ పరంగా విశ్వాసం ఉండటంతో బలమైన అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.