
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం చేసుకున్న హర్యానా పోలీసులు.. డైరీలో ఆ దేశంపై ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు.
'ట్రావెల్ విత్ జో' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్న ఆమె నుంచి పోలీసులు వ్యక్తిగత డైరీను స్వాధీనం చేసుకున్నారు.
ఆ డైరీలోని కొన్ని పేజీల్లో పాకిస్తాన్ పట్ల ఆమెకు ఉన్నఅభిమానాన్ని,ఆ దేశానికి ఆమె చేసిన పర్యటనలో పొందిన అనుభవాలను వివరంగా లిఖించారు.
ఈ కేసుపై ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగాలు కలిసి సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
వివరాలు
పాకిస్తాన్‌కు అనుబంధంగా గూఢచారి నెట్‌వర్క్
హర్యానాలోని హిసార్ ప్రాంతంలో ఉన్న న్యూ అగర్సైన్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో మే 16న ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
జ్యోతి మల్హోత్రాపై అధికారిక రహస్యాల చట్టం (Official Secrets Act)తో పాటు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNS)లోని అనుసంధానిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
గత రెండు వారాలుగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గూఢచార కార్యకలాపాలపై పట్టుబడిన 12 మంది మధ్య జ్యోతి కూడా ఒకరుగా గుర్తించబడింది.
ఉత్తర భారతదేశంలో పాకిస్తాన్‌కు అనుబంధంగా ఉన్న గూఢచారి నెట్‌వర్క్ పని చేస్తున్నదనే అనుమానాన్ని దర్యాప్తు సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.
వివరాలు
లాహోర్ పర్యటనకు రెండు రోజులు చాలలేదు
జ్యోతి మల్హోత్రా వద్ద లభించిన 2012 క్యాలెండర్‌తో ఉన్న పాత డైరీలో పాకిస్తాన్ పర్యటన అనంతరం ఆమె రాసిన వ్యక్తిగత నోట్స్ వెలుగులోకి వచ్చాయి.
ఆ డైరీలో పాకిస్తాన్ పట్ల తనకున్న ప్రేమను ఆమె స్వయంగా వ్యక్తీకరించారు.
అలాగే అక్కడ సేకరించిన సమాచారాన్ని, తాను అనుభవించిన విషయాలను కూడా పేర్కొన్నారు.
ఆమె డైరీలో ఒక చోట ఇలా రాసింది: "ఈ రోజు పాకిస్తాన్‌లో పది రోజుల పర్యటన ముగించుకుని తిరిగి భారత్‌కి వచ్చాను. ఈ పది రోజుల్లో అక్కడి ప్రజల నుంచి నాకు అపారమైన ప్రేమ లభించింది. మా సబ్‌స్క్రైబర్లు, స్నేహితులు మమ్మల్ని కలవడానికి వచ్చారు. లాహోర్ పర్యటనకు రెండు రోజులు చాలలేదు, ఇంకా చూడాల్సినవి చాలానే మిగిలిపోయాయి."
వివరాలు
పాకిస్తాన్ "క్రేజీ, రంగులమయమైన దేశం"
ఇంకొక పేజీలో, "సరిహద్దుల మధ్య దూరాలు ఎంతకాలం ఉండబోతున్నాయో తెలియదు. కానీ మనస్సుల్లోని బాధలు మాత్రం తొలగిపోవాలి.మనమంతా ఒక్కటే నేలపై జన్మించినవాళ్లం. వీడియోల్లో నేను చెప్పని విషయాలపై మీకేదైనా సందేహాలుంటే, నిర్భయంగా కామెంట్స్‌లో అడగండి" అంటూ రాసుకున్నారు.
పాకిస్తాన్‌ను "క్రేజీ, రంగులమయమైన దేశం"గా వర్ణించిన జ్యోతి,అక్కడ అనుభవించిన అనుభూతులను మాటల్లో వివరించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
అంతేకాకుండా,ఆమె పాకిస్తాన్ అధికారులకు ఓ విజ్ఞప్తి కూడా చేశారు."భారతీయుల కోసం అక్కడ మరిన్ని ఆలయాలు,గురుద్వారాలను తెరవాలి.హిందువులు సులభంగా అక్కడికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.అక్కడి పురాతన ఆలయాలను సంరక్షించాలి.1947 విభజన సమయంలో విడిపోయిన కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఇవ్వాలి.పాకిస్తాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.అది నిజంగా ఓ రంగులతనంతో నిండి ఉన్న దేశం"అని డైరీలో రచించారు.