Page Loader
YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్ 
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్

YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనా వ్యవస్థలు నియంత్రణ కోల్పోతున్న నేపథ్యంలో, పోలీసు వ్యవస్థ ఎలా దిగజారిపోతోందో తెనాలి ఘటన స్పష్టంగా చూపుతోందని వ్యాఖ్యానించారు.

వివరాలు 

రేపు వెన్నుపోటు దినోత్సవం నిరసనలకు పిలుపు… 

బుధవారం 'వెన్నుపోటు దినోత్సవం' పేరుతో రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని జగన్ పిలుపునిచ్చారు. తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన యువకుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలను పరిశీలిస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ 'రెడ్ బుక్‌ రాజ్యాంగం' ద్వారా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా స్వరం వినిపించిన ప్రతీ ఒక్కరిని అణచివేయడానికి కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాలు 

తెనాలి ఘటన పోలీసు వ్యవస్థ దిగజారినదానికి ఉదాహరణ 

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని పోలీస్ వ్యవస్థ అమలు చేస్తోందని జగన్ ఆరోపించారు. దీనికి తెనాలి ఘటన ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. తెనాలి ఘటనలో ఏమైంది, ఎలా జరిగింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

వివరాలు 

పోలీసులను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుతున్న ప్రభుత్వం 

రెడ్‌ బుక్‌ పాలన కింద సీఐలు, డీఎస్పీలను ప్రభుత్వమే కలెక్షన్ ఏజెంట్లుగా మార్చిందని జగన్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పోలీసులను నియంత్రించి మామూళ్లు వసూలు చేయిస్తున్నారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని, పర్మిట్‌ రూములు, బెల్ట్‌ షాపుల ద్వారా భారీగా డబ్బులు వసూలు చేసి, ఆ మొత్తాన్ని చంద్రబాబు, లోకేష్‌లకు వాటా చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఇసుక, క్వార్ట్జ్‌, లాటరైట్‌ వంటి ఖనిజ వనరులను బహిరంగంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

వివరాలు 

కుటుంబాల పరువు తీసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు 

కేసులు ఉన్నారనే కారణంతో వ్యక్తులను ముద్దాయిలుగా ముద్రించడమేగాక వారి కుటుంబాల పరువును తీసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. తెనాలి ఘటనలో బాధితుడు రాకేష్ చెల్లెలు ఇంజినీరింగ్ పూర్తిచేసిందని, వారి కుటుంబ పరువు తీశారని, మరో యువకుడు విక్టర్ తండ్రి ప్రజాశక్తి పత్రికలో విలేఖరిగా పనిచేస్తున్నారని చెప్పారు. తెనాలిలో నివాసం లేని రాకేష్‌ అనే యువకుడిని ఇష్టం వచ్చినట్లుగా కేసులో ఇరికించారని తీవ్ర ఆరోపణలు చేశారు.