LOADING...
Black Bat Flower: ప్రకృతిలో ఎన్నో పూలు ఉన్నా... 'గబ్బిలం పువ్వు' మాత్రం అద్భుతం 
ప్రకృతిలో ఎన్నో పూలు ఉన్నా... 'గబ్బిలం పువ్వు' మాత్రం అద్భుతం

Black Bat Flower: ప్రకృతిలో ఎన్నో పూలు ఉన్నా... 'గబ్బిలం పువ్వు' మాత్రం అద్భుతం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రకృతిలోని ఎన్నో వింతలలో ఒకటి బ్లాక్ బ్యాట్ ఫ్లవర్. నల్లని రంగుతో,ఆకారంలో ఎగురుతున్న గబ్బిలంలా కనిపించడం దీని ప్రత్యేకత. అరుదైన ఈ పుష్పాన్ని ఒక్కసారిగా చూస్తే మొక్క మీద నిజంగానే గబ్బిలం కూర్చుని ఉందేమో అనిపిస్తుంది. ఇది కంద జాతికి చెందిన ఒక ప్రత్యేక మొక్కపై పూస్తుంది.అందుకే దీనిని "బ్లాక్ బ్యాట్ ఫ్లవర్" లేదా "గబ్బిలం పువ్వు" అని పిలుస్తారు. 1901లో ఫ్రెంచ్ వ్యాపారి,కళాసేకర కలెక్టర్ ఎడ్వర్డ్ ఆండ్రూ తొలిసారి తన పుస్తకంలో దీని గురించి వర్ణించారు. టక్కా చాంట్రియరి అని కూడా పిలిచే ఈ పుష్పం డయోస్కోరేసి కుటుంబానికి చెందింది. వింతైన ఆకారంతో పాటు దీని నల్లటి రంగు ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రత్యేకం చేస్తుంది.

వివరాలు 

ఇంట్లో కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు 

ఈ మొక్కలు సెమీ-ట్రాపికల్ వాతావరణంలో బాగా పెరుగుతాయి. పువ్వు ఎంత పెద్దగా ఉంటే, ఆ మొక్క అంత ఆరోగ్యంగా ఉందని అర్థం. ఈ పువ్వులోని కేసరాలు పొడవాటి మీసాల్లా ఉండి,రేకులు గబ్బిలం రెక్కల్లా ఉంటాయి. కనుకే దీనికి "గబ్బిలం పువ్వు" అనే పేరు వచ్చింది. తేమ ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్, కంబోడియా, దక్షిణ చైనా, లావోస్, మలేషియా, మయన్మార్, థాయిలాండ్ అడవుల్లో ఇవి సహజసిద్ధంగా పెరుగుతాయి. మొక్కల పెంపకంలో ఆసక్తి ఉన్నవారు ఇంట్లోనూ దీన్ని పెంచుకోవచ్చు. తగిన స్థలం ఉంటే, నీడ ఉన్న ప్రదేశంలో లేదా లోపల కూడా పెరుగుతుంది. అయితే మొట్టమొదట్లో పెంచడంలో కొంత కష్టంగా అనిపించినా, సరైన సంరక్షణ ఇస్తే బాగా వృద్ధి చెందుతుంది.

వివరాలు 

ఔషధ గుణాలతో కూడా ప్రసిద్ధి ఈ గబ్బిలం పువ్వు

వసంతం నుంచి శరదృతువు మొదలు వరకు ఈ పువ్వులు పూస్తాయి. వాతావరణం అనుకూలిస్తే ఒకేసారి చాలా పుష్పాలు వికసించి ఆ మొక్క మరింత అందంగా, ఆకర్షణీయంగా మారుతుంది. కేవలం అందం మాత్రమే కాదు,ఈ గబ్బిలం పువ్వు ఔషధ గుణాలతో కూడా ప్రసిద్ధి చెందింది. చైనీస్ సంప్రదాయ వైద్యంలో దీన్ని ప్రత్యేక ఔషధాల తయారీలో వాడుతారు. అధిక రక్తపోటు,గ్యాస్ట్రిక్ అల్సర్లు,హెపటైటిస్ వంటి సమస్యల నివారణకు దీని రైజోమ్స్ ఉపయోగిస్తారు. వీటిలో టాక్కలోనోలైడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. వీటికి క్యాన్సర్‌ను ఎదుర్కొనే గుణం ఉందేమో అనే దిశగా ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.

వివరాలు 

దక్షిణాసియాలో "దెయ్యం పువ్వులు"

ముదురు రంగు, గబ్బిలాన్ని తలపించే ఆకారం, పొడవాటి పిల్లి మీసాల్లాంటి కేసరాలు, రెక్కల్లాంటి రేకులు.. అన్నీ కలిపి ఈ పువ్వును మరింత వింతగా,అద్భుతంగా నిలబెడతాయి. సుమారు 12 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల పొడవు కలిగిన ఈ పువ్వులు ఒక్కసారిగా చూస్తే కొంత భయపెట్టేలా అనిపిస్తాయి. అందుకే వీటిని దక్షిణాసియాలో "దెయ్యం పువ్వులు" అని కూడా పిలుస్తారు.