వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ గురించి ఎక్కువ మందికి తెలియని విషయాలు
భారత జాతీయ గీతం జనగణమన అయితే జాతీయ గేయం(నేషనల్ సాంగ్) వందేమాతరం. ఈ పాటను బంకించంద్ర ఛటర్జీ రచించారు. 1882లో ఆయన ప్రచురించిన ఆనంద్ మఠ్ అనే నవల నుండి వందేమాతరం శ్లోకాన్ని తీసుకున్నారు. ఈరోజు బంకించంద్ర ఛటర్జీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని విశేషాలు తెలుసుకుందాం. నిజానికి బంకించంద్ర ఛటర్జీ అసలు పేరు బంకించంద్ర చటోపాధ్యాయ. కానీ బ్రిటిష్ వారు పలకలేక ఛటర్జీ అని పిలిచారు. ఆ తర్వాత అదే అలవాటుగా మారింది. ఛటర్జీ ఒక నవలాకారుడుగా, రచయితగా, జర్నలిస్టుగా పనిచేశారు. సాహిత్య సామ్రాట్ అనే బిరుదు గల ఛటర్జీ, 1838 జూన్ 26వ తేదీన పశ్చిమబెంగాల్ లోని నైహటి గ్రామంలో జన్మించారు.
ఆనంద్ మఠ్ నవలలో బెంగాల్ కరువు పరిస్థితులు
ఆ కాలంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవి. బంకించంద్ర ఛటర్జీకి 11 ఏళ్ల వయసులో పెళ్లి జరిగింది. అయితే మొదటి భార్య ఏవో కారణాలవల్ల మరణించడంతో మరో భార్య రాజ్యలక్ష్మి దేవిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ముగ్గురు కూతుళ్లు. రచయితగా ఎన్నో రచనలు చేసిన బంకించంద్ర చటర్జీకి మొదటగా సాంగ్ బడ్ ప్రభాకర్ అనే వీక్లీ మ్యాగజైన్ ద్వారా గుర్తింపు వచ్చింది. అప్పటినుండి రచయితగా ఆయన కెరీర్ మలుపు తిరిగింది. 1882లో ఆనంద్ మఠ్ ప్రచురించారని ముందే చెప్పుకున్నాం. 1770లో బెంగాల్ లో వచ్చిన కరువు పరిస్థితులను ఈ నవలలో తెలియజేశారు ఛటర్జీ. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఎలాంటి శిక్షణాలేని భారత సైన్యం ఎదుర్కొన్నట్లుగా ఈ నవలలో ఛటర్జీ ఊహిస్తూ రాసుకొచ్చారు.
ఇంగ్లీష్ లో రచనలు చేయాలనుకున్న ఛటర్జీ
సాహిత్యంలో రకరకాల ప్రయోగాలు చేసిన ఛటర్జీ, 1872లో బంగదర్శన్ అనే సాహిత్య మ్యాగజైన్ ను మొదలుపెట్టారు. ఈ మ్యాగజైన్లో కథలు, చారిత్రక అంశాలు, వ్యాసాలు, కార్టూన్స్ ఉండేవి. బెంగాల్ లో రచనలు చేసే ఛటర్జీ ఇంగ్లీషులో కూడా రచనలు చేయాలని అనుకున్నారు. కానీ ఇంగ్లీష్ మీద పట్టు లేకపోవడంతో తన మాతృభాష బెంగాల్ లోనే రచనలు చేస్తూ వచ్చారు. దుర్గేష్ నందిని, కపాల్ కుండల అనే రెండు నవలలు ఛటర్జీ మొదటి ప్రచురణలు. వీటిని ఇతర భాషల్లోకి కూడా అనువదించారు. ఛటర్జీ కెరీర్లో చెప్పుకోదగ్గ నవలలుగా పేరు తెచ్చుకున్న వాటిల్లో చంద్రశేఖర్, రజని అనే నవలలు ఉన్నాయి. ఛటర్జీ రచనల ఆధారంగా 50 సినిమాల వరకు తెరకెక్కాయి.