Page Loader
CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ
7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ

CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతకాలంలో యాంత్రికత పెరిగిన జీవనశైలిలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువత కూడా ఈ సమస్యలకు గురవుతున్నారు. గుండె జబ్బులను గుర్తించేందుకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో లేవు. ఈ తరుణంలో 14 ఏళ్ల యువకుడు సిద్దార్థ్‌ ఒక ఏఐ ఆధారిత మొబైల్ యాప్‌తో ఈ సమస్యకు వినూత్న పరిష్కారాన్ని అందించాడు. కేవలం స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించి 7 సెకన్లలో గుండె ఆరోగ్యాన్ని పరీక్షించే విధంగా రూపొందించిన ఆ యాప్‌ విశేషాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

వివరాలు 

7 సెకన్లలో హృదయ స్పందన రికార్డు

సిద్ధార్థ్‌ ఇప్పుడు కార్డియాలజిస్ట్‌ స్థానాన్ని స్మార్ట్‌ఫోన్‌లోని ఏఐ యాప్‌తో భర్తీ చేస్తున్నాడు. గుండె ఆరోగ్య పరీక్షలు చేస్తూ వైద్య నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాడు. గుంటూరులోని జీజీహెచ్‌లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిపై రెండు రోజుల పాటు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి అందరి మెప్పు పొందాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకి చెందిన నంద్యాల సిద్ధార్థ్‌ కుటుంబం 2010లో అమెరికాలో స్థిరపడింది. అక్కడే విద్యనభ్యసిస్తూ, కృత్రిమ మేథ (AI) ఆధారంగా పనిచేసే "సర్కాడియన్‌" అనే యాప్‌ను అభివృద్ధి చేశాడు. ఈ యాప్‌ ద్వారా కేవలం 7 సెకన్లలో హృదయ స్పందనను గుర్తించి రికార్డు చేయగలగడం విశేషం.

వివరాలు 

500మందిపై స్క్రీనింగ్‌.. 10మందిలో గుండె సమస్యలు

రోగికి గుండె సంబంధిత సమస్యఉంటే,యాప్‌ ద్వారా బీప్‌ శబ్దంతో పాటు ఎరుపు కాంతి వెలిగేలా చేసి, స్క్రీన్‌పై"అబ్నార్మల్ హార్ట్‌బీట్‌"అనే హెచ్చరిక వస్తుంది. ఇప్పటివరకు సిద్దార్థ్‌ 500మందిపై స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా,వారిలో 10మందిలో గుండె సమస్యలు ఉన్నట్లు గుర్తించాడు. తర్వాతి దశలో వీరికి ఈసీజీ (ECG),2D ఎకో టెస్టులు నిర్వహించగా అందరికీ గుండె వ్యాధులు ఉన్నట్టు నిర్ధారణ అయింది. అత్యంత చిన్నవయస్సులో సర్టిఫైడ్‌ ఏఐ టెక్నాలజీ నిపుణుడిగా గుర్తింపు పొందిన వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. చిన్నతనం నుంచే కోడింగ్‌ పట్ల ఆసక్తి చూపిన సిద్ధార్థ్‌ను తల్లిదండ్రులు పూర్తిగా ప్రోత్సహించారు. వయసు ప్రకారం 8వతరగతిలో ఉండాల్సిన అతను,తన ప్రతిభ ఆధారంగా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో ఏఐ ఆధారిత కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నాడు.

వివరాలు 

కృత్రిమ మేథపై ఉన్న ఆసక్తితో అనేక ప్రయోగాలు

7 సెకన్లలో గుండె వ్యాధులను గుర్తించగలిగిన ఈ ప్రతిభకు తెలంగాణ సీఎం సైతం అభినందనలు తెలియజేశారు. సిద్ధార్థ్‌ తన 12వ ఏట "సర్కాడియన్‌ ఏఐ" పేరుతో ఒక స్టార్టప్‌ను స్థాపించాడు. కృత్రిమ మేథపై ఉన్న ఆసక్తితో అనేక ప్రయోగాలను నిర్వహించాడు. ఇదే క్రమంలో గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణ కోసం ఒక AI యాప్‌ను రూపుదిద్దాడు. అమెరికాలో 15 వేల మందిపై స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా,వారిలో 3,500 మందికి గుండె సమస్యలు ఉన్నట్లు గుర్తించాడు. సిద్దార్థ్‌ అభివృద్ధి చేసిన "సర్కాడియన్‌" యాప్‌ 93 శాతం కచ్చితత్వంతో ఫలితాలను ఇస్తుందని వైద్యులు,అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

వివరాలు 

సొంత రాష్ట్రానికి సేవలందించేందుకు ప్రత్యేక కార్యాచరణ

ఈ యాప్‌ ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా రోగులు సమీప ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం ద్వారా సకాలంలో వ్యాధిని గుర్తించి ఆరోగ్యంగా ఉండే అవకాశం కలుగుతుంది. ఈ స్టార్టప్‌తో కలిసి పనిచేయడానికి అమెరికాలోని అనేక ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయని సిద్ధార్థ్‌ తెలిపాడు. అయితే తన సొంత రాష్ట్రానికి సేవలందించేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించాడు. అంతేకాక, హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్‌ ఏఐ సదస్సులో సిద్ధార్థ్‌ ప్రతిభను మెచ్చిన మంత్రి శ్రీధర్ బాబు తన వాచ్‌ను బహుమతిగా అందజేశారు.