
50 years of Aryabhata: ఆర్యభట్ట ఉపగ్రహానికి 50 ఏళ్లు.. భారత అంతరిక్ష ప్రయాణంలో చిరస్మరణీయ అధ్యాయం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గోల్డెన్ జూబిలీ వేడుకలను ఘనంగా ప్రారంభించింది.
ఈ ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష ప్రయాణానికి మూల స్థంభంగా నిలిచింది.
1975, ఏప్రిల్ 19న సోవియట్ యూనియన్‌కు చెందిన కాస్మోస్-3ఎం రాకెట్ ద్వారా ఆర్యభట్టను రష్యాలోని కపుస్తిన్ యర్ అనే పట్టణం నుంచి లాంచ్ చేశారు.
ఇది పూర్తిగా భారత్‌లో డిజైన్ చేసి, తయారు చేసిన తొలి స్వదేశీ శాటిలైట్ కావడం విశేషం.
వివరాలు
రష్యా సహకారంతో ఏప్రిల్ 1975లో ఉపగ్రహ ప్రయోగం
ఇది కేవలం 36 నెలల్లోనే రూపొందించబడింది.ఈ విజయానికి వెనుక కేంద్రంగా నిలిచిన వ్యక్తి డాక్టర్ ఉడుపి రామచంద్ర రావు (యూఆర్ రావు), ఆయన శాస్త్రవేత్తల బృందం.
1970 నాటికి శాటిలైట్ డిజైన్,అభివృద్ధి,పరీక్షలు,ప్రయోగం చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు,మానవ వనరులు లేని సమయంలో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడం ఒక సాహసోపేత నిర్ణయం.
బెంగళూరులోని పీణ్య అనే చిన్న స్థలంలో ఒక ఇంటిలో ప్రారంభమైన ఈ ప్రయాణం,దేశవ్యాప్తంగా ఉన్న అనేక శాస్త్రవేత్తలతో జట్టు ఏర్పాటు చేసి ముందుకు నడిపారు.
అప్పటి సోవియట్ రష్యా సహకారంతో ఏప్రిల్ 1975లో ఉపగ్రహ ప్రయోగం సాకారమైంది.
మొదట అమెరికా సహకారంతో స్కౌట్ రాకెట్ ద్వారా లాంచ్ చేయాలని ఆలోచనగా ఉన్నా,తక్కువ ఖర్చుతో ప్రయోగించవచ్చని భావించి సోవియట్ యూనియన్‌ను ఎంపిక చేశారు.
వివరాలు
యూఆర్ రావు నేతృత్వంలో 200 మంది శాస్త్రవేత్తలు,ఇంజినీర్లు
ఇందుకు సంబంధించిన వివరాలను గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ రిపోర్టు పేర్కొంది.
ఇందిరా గాంధీకి భారత రాయబరి ద్వారా వచ్చిన సిఫార్సుతో,సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తమ రాకెట్ ద్వారా భారత ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది.
అమెరికాతో భారత్ భాగస్వామ్యం పెరుగుతోందన్న ఆందోళనతోనే రష్యా ముందుకు వచ్చిందని నివేదిక పేర్కొంది.
1972లో ఇస్రో, సోవియట్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందం కింద బెంగళూరులోని పీణ్య వద్ద శాటిలైట్ సిస్టమ్స్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేశారు.
యూఆర్ రావు నేతృత్వంలో 200 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పనిచేశారు.ఆర్యభట్ట ద్వారా భారత్, అంతరిక్ష పరిశోధనలో దీర్ఘకాలిక లక్ష్యాల దిశగా తొలి మెట్టు వేసింది.
అనుభవం లేని యువ శాస్త్రవేత్తల బృందం ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది.
వివరాలు
ఏప్రిల్ 19వ తేదీ శాటిలైట్ టెక్నాలజీ డే
ఈ శాటిలైట్‌కు ప్రాచీన భారత గణితశాస్త్రవేత్త ఆర్యభట్ట పేరు పెట్టారు. ఏప్రిల్ 19వ తేదీని శాటిలైట్ టెక్నాలజీ డేగా జరుపుకుంటారు.
ఈ ఉపగ్రహం 358 కిలోల బరువుతో,షట్కోణాకారంగా,మొత్తం 26 ముఖాలతో రూపొందించబడింది.
దీని శరీరానికి పై భాగం,అడుగు భాగాన్ని మినహాయించి మిగిలిన 24ముఖాలపై సోలార్ సెల్స్ అమర్చారు.
ఇవి 46 వాట్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తూ,నికెల్ కాడ్మియం బ్యాటరీలలో నిల్వ చేశారు.
బ్యాటరీలు 10 ఆంపియర్-అవర్ సామర్థ్యాన్ని కలిగి ఉండేవి. అయితే, లాంచ్ అయిన నాలుగో రోజుకు పవర్ విఫలమైంది.
ఐదో రోజుకు ఉపగ్రహం సిగ్నల్స్ నశించాయి.అయినప్పటికీ 1981 వరకు మెయిన్‌ఫ్రేమ్ పని చేసింది. ఉపగ్రహం 17 ఏళ్లపాటు కక్ష్యలోనే కొనసాగింది. చివరికి 1992 ఫిబ్రవరి 11న భూగోళ వాతావరణంలోకి ప్రవేశించింది.
వివరాలు
శ్రీహరికోట వద్ద హెలికాప్టర్ సహాయంతో ఇంజనీరింగ్ మోడల్ పరీక్ష
1973 మేలో హైదరాబాద్ సమీపంలో బెలూన్ సహాయంతో ఈ ఉపగ్రహం సగభాగాన్ని 25 కి.మీ. ఎత్తుకు తీసుకెళ్లి పరీక్షించారు.
1975 జనవరిలో శ్రీహరికోట వద్ద హెలికాప్టర్ సహాయంతో ఇంజనీరింగ్ మోడల్‌ను పరీక్షించారు.
మూడేళ్ల వ్యవధిలో నాలుగు మోడల్స్ తయారు చేశారు. వీటిని అనుభవం లేని యువతతో రూపొందించడం విశేషం.
ఇస్రో చైర్మన్ సతీశ్ ధవన్ ఈ ప్రాజెక్టుకు సలహాలు అందించారు.ఆర్యభట్ట ప్రయోగం తర్వాత యూఆర్ రావు 1984 నుండి 1994 వరకు ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఆయన ప్రతీ శాటిలైట్ అభివృద్ధిలో ఏదో ఒక స్థాయిలో పాల్గొనడం అనివార్యంగా మారింది.
వివరాలు
ఆర్యభట్ట లాంచ్‌కి కొద్దిరోజుల ముందే విక్రమ్ సారాభాయి కన్నుమూత
యూఆర్ రావు, విక్రమ్ సారాభాయి శిష్యుడు. సారాభాయి దేశీయ శాటిలైట్ ప్రోగ్రామ్ నడిపేందుకు విశ్వసనీయ వ్యక్తిని కోరుకునే క్రమంలో, ఎంఐటీలో ఉన్న యూఆర్ రావును ఆహ్వానించి బాధ్యత అప్పగించారని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ వెల్లడించారు.
అయితే, ఆర్యభట్ట లాంచ్‌కి కొద్దిరోజుల ముందే విక్రమ్ సారాభాయి మరణించారు.
దీని వల్ల ప్రాజెక్ట్‌లో కలవర రేఖలు చీలిక చేయగా, యూఆర్ రావు, ఆయన బృందం ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుని ప్రయోగాన్ని విజయవంతంగా నెరవేర్చారు.
వివరాలు
ఆర్యభట్ట పరిశోధనలు:
ఈ ఉపగ్రహం మూడు ప్రధాన పరిశోధనలు చేసింది:
కాస్మిక్ ఎక్స్-రే స్టడీస్
సూర్యుని నుండి వచ్చే న్యూట్రాన్ల అధ్యయనం
గామా రే పరిశోధనలు
భూమి వాతావరణం, నక్షత్రాల, గెలాక్సీల, బ్లాక్ హోల్స్ వంటి ఖగోళ వస్తువులపై పరిశోధనలు నిర్వహించేందుకు రూపొందించారు.
దీనిని మొదట సోవియట్ రష్యాలోని బేర్‌లేక్ గ్రౌండ్ స్టేషన్ ద్వారా కంట్రోల్ చేసారు.
ఆ తర్వాత శ్రీహరికోట షార్ కేంద్రం నుండి నిర్వహించారు.
గ్రౌండ్ స్టేషన్ ద్వారా ఉపగ్రహం పంపే డేటాను విశ్లేషించి, ఉపగ్రహం స్థితిని అంచనా వేయడం జరిగింది.
ఆర్యభట్ట ప్రయోగం తర్వాత శాటిలైట్ మిషన్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై అవగాహన ఏర్పడింది. ఇది తదుపరి తరం శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలిచింది.