Page Loader
India returns to space:40ఏళ్ల నిరీక్షణకు తెర.. మరో అంతరిక్షయాత్రకు భారత్ సిద్ధం.. మేలో తొలి వ్యోమగామి.. ఎవరీ శుభాన్షు శుక్లా..?
40ఏళ్ల నిరీక్షణకు తెర.. మరో అంతరిక్షయాత్రకు భారత్ సిద్ధం.. మేలో తొలి వ్యోమగామి.. ఎవరీ శుభాన్షు శుక్లా..?

India returns to space:40ఏళ్ల నిరీక్షణకు తెర.. మరో అంతరిక్షయాత్రకు భారత్ సిద్ధం.. మేలో తొలి వ్యోమగామి.. ఎవరీ శుభాన్షు శుక్లా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారతదేశం, మే నెలలో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని లిఖించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు భారత వ్యోమగామిని పంపేందుకు దేశం సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఇటీవల ఇస్రో భవిష్యత్తు ప్రణాళికలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈసారి మేలో జరగనున్న ప్రైవేట్ మిషన్‌లో భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారని తెలిపారు.

వివరాలు 

4 దశాబ్దాల తర్వాత మళ్లీ అంతరిక్షంలోకి భారతీయుడు 

డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించబోయే తొలి భారతీయుడిగా రాకేష్ శర్మ పేరును గుర్తు చేశారు. ఆయన 1984లో సోవియట్ అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్ష యాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ మొదటిసారి భారత్ తరపున వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, ఇస్రో చైర్మన్‌గా ఉన్న డాక్టర్ వి. నారాయణన్ రాబోయే అంతరిక్ష కార్యక్రమాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

వివరాలు 

ఆక్సియమ్-4 మిషన్‌లో భాగంగా శుక్లా ప్రయాణం 

ఈసారి జరగనున్న అంతరిక్ష యాత్ర "ఆక్సియమ్ స్పేస్ X-4 మిషన్"లో భాగమై ఉంటుంది. ఇందులో గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా మే నెలలో ఐఎస్ఎస్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మిషన్‌కి సంబంధించి ప్రారంభ బడ్జెట్ $1.1 బిలియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం దానిని $2.32 బిలియన్ డాలర్లకు పెంచినట్టు అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రయాణం ద్వారా శుక్లా అందుకునే అనుభవాలు, తర్వాతి భారత అంతరిక్ష ప్రయోగాలకు, ముఖ్యంగా ఇస్రో అభివృద్ధి చేస్తున్న మానవ అంతరిక్ష మిషన్లకు ఎంతో ఉపయోగా పడతాయి. ఈ అంతరిక్ష నౌక ప్రయోగాన్ని అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించనున్నారు.

వివరాలు 

శుక్లాతో పాటు ఇతర సభ్యులు ఎవరు? 

ఈ మిషన్‌కు నేతృత్వం వహించేది మాజీ నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్. ఆమె మిషన్ కమాండర్‌గా వ్యవహరిస్తారు. 39 ఏళ్ల శుక్లా ఈ ప్రయాణంలో పైలట్ పాత్రను పోషించనున్నారు. ఆయన దాదాపు రెండు వారాల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో శుక్లా అనేక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొననున్నారు. ఈ మిషన్‌లో శుక్లాతో పాటు ఇతర సభ్యులుగా పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ, విస్నివ్స్కీ, అలాగే హంగేరీకి చెందిన టిబోర్ కాపు పాల్గొంటారు. ఈ మిషన్ ద్వారా ఐఎస్ఎస్‌కి మొదటిసారిగా భారత్, పోలాండ్, హంగేరీ దేశాలకు చెందిన వ్యోమగాములు ఒకేసారి వెళ్లనుండటం విశేషం.

వివరాలు 

ఎవరీ కెప్టెన్ శుభాన్షు శుక్లా? 

గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా భారత వైమానిక దళానికి చెందిన అనుభవజ్ఞుడైన యుద్ధ విమాన పైలట్. ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ (HSP) కింద ఎంపికైన ఆయన, భారతదేశ తొలి మానవ అంతరిక్ష ప్రయోగం "గగన్‌యాన్" మిషన్‌లో అగ్ర అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్నారు. శుక్లా 2006లో భారత వైమానిక దళంలోకి చేరారు. అప్పటి నుంచి సుఖోయ్-30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్, An-32 వంటి యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉంది. మొత్తం 2,000 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవం ఆయన సొంతం. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో ఆయన సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు.

వివరాలు 

శిక్షణ, ఎంపికల నేపథ్యంలో శుక్లా ప్రయాణం 

జూన్ 2006లో IAF ఫైటర్ వింగ్‌లో శుక్లా చేరారు. కాలక్రమేణా 2024 మార్చిలో గ్రూప్ కెప్టెన్ స్థాయికి ఎదిగారు. 2019లో శుక్లాకు ఇస్రో నుంచి మానవ అంతరిక్ష ప్రోగ్రామ్‌కు ఎంపిక కోసం ఆహ్వానం అందింది. ఆ తర్వాత ఆయన రష్యాలోని మాస్కోలో ఉన్న స్టార్ సిటీలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో గాఢమైన శిక్షణను పొందారు. 2024 ఫిబ్రవరి 27న భారత ప్రధాని నరేంద్ర మోదీ గగన్‌యాన్ మిషన్‌లో పాల్గొనే 4మంది ఎలైట్ వ్యోమగాముల్లో శుభాన్షు శుక్లా పేరును ప్రకటించారు. అలాగే, 2024 ఆగస్టులో జరగనున్న ఇండియా-అమెరికా సంయుక్త మిషన్‌కి 'ప్రధాన వ్యోమగామిగా' ఆయనను ఎంపిక చేశారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఈ మిషన్‌కు బ్యాకప్ వ్యోమగామిగా ఎంపికయ్యారు.