నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఆదిత్య L-1పైనే.. సూర్యుడిపైకి తొలిసారిగా..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1ను నేడు ప్రయోగించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను మోసుకుంటూ PSLV C-57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇప్పటికే ప్రయోగ రిహార్సల్ విజయవంతమయ్యాయి. తాజాగా కౌంట్‌డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 23.40గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియను ఇస్రో శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే సరిగ్గా ఉదయం 11.50గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఆదిత్య-L1 శాటిలైట్‌లో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి
సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు గాను ఆదిత్య-L1 శాటిలైట్‌లో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి. వీటిలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ (వీఈఎల్‌సీ) మొదటి పేలోడ్. ఈ మిషన్‌లో ఇదే అతి కీలకమైంది. దీన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) శాస్త్రవేత్తలు రూపొందించారు. వీఈఎల్‌సీ పేలోడ్ నిమిషానికో ఫొటో చొప్పున 24 గంటల్లో 1,440 చిత్రాలను పంపిస్తుందని సదరు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సూర్యుడిపై అధ్యయనం ద్వారా నక్షత్రాలు, పాలపుంతకు సంబంధించిన మరిన్ని కీలక అంశాలను తెలుసుకోవచ్చని వివరించారు. మరోవైపు L-1 పాయింట్ వద్ద ఈ శాటిలైట్‌ను ప్రవేశపెట్టడంతో సూర్యుడ్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుంటుంది.