
Axiom-4 mission: శుభాంశు శుక్లా అంతరిక్షయాత్రలో చేసిన ప్రయోగాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల 14న భూమి వైపు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు నాసా వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు కాలిఫోర్నియా తీరంలో క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ భూమి పైకి దిగనుంది. భూమి మీదకు వచ్చిన వెంటనే వ్యోమగాములను ఏడు రోజులపాటు క్వారంటైన్‌కు తరలించనున్నట్లు నాసా తెలిపింది. మొత్తం 18 రోజుల అంతరిక్ష ప్రయాణంలో శుభాంశు బృందం పలు పరిశోధనలు చేపట్టింది.
వివరాలు
ఏడు రోజులపాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లో..
శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక ప్రయోగాలు పూర్తి చేసి, తిరుగు ప్రయాణమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:35 గంటలకు అన్‌డాకింగ్ ప్రక్రియ పూర్తయిందని నాసా ప్రకటించింది. ఆ తర్వాత పలు ఆర్బిటల్ ప్రక్రియల అనంతరం ఈ నెల 15 మధ్యాహ్నం 3 గంటలకు క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ కాలిఫోర్నియా తీరంలో దిగనుంది. వ్యోమగాములు శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్ కపులు అంతరిక్షంలో గరిష్ఠకాలంగా భారరహిత వాతావరణంలో ఉన్న కారణంగా భూమి వాతావరణానికి మళ్లీ వారి శరీరాలు అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది. అందుకోసం వారిని ఏడు రోజులపాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచనున్నట్లు తెలిపింది.
వివరాలు
అంతరిక్ష జీవనవిధానంపై పరిశోధనలు
ఈ మొత్తం వ్యవధిలో వ్యోమగాముల ఆరోగ్యం, శరీర సహజ స్థితిని పునరుద్ధరించేందుకు ఇస్రో వైద్య బృందం పర్యవేక్షణ చేయనుందని వివరించింది. అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా మైక్రో ఆల్గీ ప్రాజెక్టుపై కీలక ప్రయోగాలు నిర్వహించినట్లు యాక్సియం స్పేస్ సంస్థ వెల్లడించింది. భవిష్యత్‌లో దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాలకు అవసరమైన ఆహారం, ఆక్సిజన్, బయో ఇంధనాల ఉత్పత్తికి మైక్రో ఆల్గీ కీలకంగా మారే అవకాశముందని పేర్కొంది. భూమికి వెలుపల జీవించేందుకు మైక్రో ఆల్గీ ఉపయోగపడుతుందని వివరించింది. అలాగే శుక్లా బృందం వాయేజర్ డిస్‌ప్లేస్ అనే మరో అధ్యయనం కూడా నిర్వహించింది. వ్యోమగాముల కంటి కదలికలు, శరీర సమన్వయంపై అంతరిక్షంలో ప్రయాణం ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించినట్లు వివరించింది.
వివరాలు
అంతరిక్ష జీవనవిధానంపై పరిశోధనలు
అంతరిక్ష వాతావరణంలో వ్యోమగాములు తమ చుట్టూ ఉన్న పరిసరాలను ఎలా గ్రహిస్తారు? ఎలా జీవించగలుగుతారు? అనే అంశాలపై కూడా పరిశోధనలు జరిగాయని తెలిపింది. దీర్ఘకాల అంతరిక్ష మిషన్లలో ఉపయోగపడే నివాస వ్యవస్థల రూపకల్పనకు ఈ అధ్యయనాలు దోహదపడతాయని పేర్కొంది. అంతేకాక, సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో మీద కూడా బృందం పరిశోధనలు చేసినట్లు వెల్లడించింది. మైక్రోగ్రావిటీ, అధిక కార్బన్ డయాక్సైడ్ స్థాయిల ప్రభావం హృదయ నాళాల పనితీరుపై ఎలా ఉంటుందో అధ్యయనం చేసినట్లు వివరించింది. ఈ పరిశోధనలు భవిష్యత్ అంతరిక్షయాత్రికులే కాకుండా భూమిపై ఉండే రోగులకు కూడా ఉపయోగపడతాయని యాక్సియం స్పేస్ స్పష్టం చేసింది.
వివరాలు
230 సార్లు భూమిని చుట్టిన వ్యోమగాములు
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా,పెగ్గీ విట్సన్,స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ,టిబర్ కపు గత నెల 25న అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ప్రయాణం ప్రారంభించారు. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నారు. అప్పటి నుంచి 18రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. మొత్తం ప్రయాణంలో శుభాంశు బృందం 96.5 లక్షల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించిందని యాక్సియం స్పేస్ వెల్లడించింది. అంతేకాక,ఈ వ్యోమగాములు ఇప్పటివరకు 230సార్లు భూమిని చుట్టినట్లు వెల్లడించింది. వ్యోమగాములు భూమి వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించే ముందు హార్డ్‌వేర్, 60 రకాల పరిశోధనలకు సంబంధించిన డేటా సహా మొత్తం 580 పౌండ్ల బరువున్న సరకులను క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో తీసుకురానున్నారని తెలిపింది.