Page Loader
New Solar System: కొత్త సౌర వ్యవస్థను కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు 
కొత్త సౌర వ్యవస్థను కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు

New Solar System: కొత్త సౌర వ్యవస్థను కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ఖగోళ శాస్త్రజ్ఞులు అంతరిక్షంలో ఒక పసి నక్షత్రం చుట్టూ ఏర్పడుతున్న వాయువుల మధ్య నుంచి గ్రహాల్లాంటి రాతి శకలాలు ఏర్పడుతున్న కీలక ఆధారాలను కనుగొన్నారు. ఈ పరిశోధన మన సౌర వ్యవస్థ ఆవిర్భావ రహస్యాన్ని ఛేదించేందుకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రపంచాలు ఆవిర్భవించే క్షణాలు ఇలాగే ఉంటాయని శాస్త్రవేత్తలు బుధవారం వెల్లడించారు. లెయిడెన్‌ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్త మెలిస్సా మెక్‌ క్లూర్ తెలిపిన వివరాల ప్రకారం... ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఓ పసి నక్షత్రం చుట్టూ ఉండే వేడివాయువుల మధ్య రాయిలాంటి గ్రహాల బీజాలను తాము ప్రత్యక్షంగా గమనించగలిగామని చెప్పారు. ఖగోళంలో గ్రహాల ఆవిర్భావ ప్రక్రియలో ఇదే మొదటి దశ అని స్పష్టంగా చెప్పవచ్చని ఆమె పేర్కొన్నారు.

వివరాలు 

 పరిశోధనలో నాసాతో పాటు ఈఎస్‌ఓ కూడా భాగస్వామి

షికాగో విశ్వవిద్యాలయం ఖగోళశాస్త్రవేత్త ఫ్రెడ్‌ సియెస్లా మాట్లాడుతూ.. ఒక గ్రహ వ్యవస్థ ఆవిర్భావంలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలిసారని చెప్పారు. "ఇన్నాళ్లుగా శాస్త్రవేత్తలు గ్రహ వ్యవస్థలు ఎలా ఏర్పడతాయో ఊహిస్తూ పరిశోధనలు చేస్తూ వచ్చారు. కానీ నేరుగా చూడలేరు.ఇప్పుడు అలాంటి అవకాశాన్ని ఈ పరిశోధన కల్పించింది" అని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో పాటు చిలీ దేశానికి చెందిన యూరోపియన్‌ సదరన్‌ అబ్జర్వేటరీ (ఈఎస్‌ఓ) కూడా భాగస్వామిగా ఉంది. దాదాపు 1,370 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న,వయస్సు లక్ష నుంచి రెండు లక్షల సంవత్సరాలు మాత్రమే ఉన్న "హెచ్‌ఓపీఎస్‌-315" అనే పసి నక్షత్రం చుట్టూ వాతావరణంలో గ్రహ వ్యవస్థ ఏర్పడుతున్న ప్రక్రియను గుర్తించగలిగారు.

వివరాలు 

ఈ దృశ్యాలను అల్మా టెలిస్కోప్‌ నెట్‌వర్క్‌ ద్వారా చిత్రీకరణ 

ఈ నక్షత్రం చుట్టూ ఉన్న వేడి గాలుల వాతావరణంలో సిలికాన్‌ మోనాక్సైడ్‌ అనే వాయువు తో పాటు స్ఫటిక ఆకృతి గల సిలికేట్‌ ఖనిజాలు ఘనీభవిస్తున్నట్టు మెక్‌ క్లూర్‌ నేతృత్వంలోని బృందం గుర్తించింది. ఈ దృశ్యాలను యూరోపియన్‌ సదరన్‌ అబ్జర్వేటరీకి చెందిన అల్మా టెలిస్కోప్‌ నెట్‌వర్క్‌ ద్వారా చిత్రీకరించారు. హెచ్‌ఓపీఎస్‌-315(HOPS-315) చుట్టూ ఎంతమంది గ్రహాలు ఏర్పడతాయో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని, అయితే పూర్తి స్థాయి గ్రహ వ్యవస్థగా మారేందుకు మరో 10 లక్షల సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని మెక్‌ క్లూర్‌ వివరించారు.