Duleep Trophy: 'పెర్త్' తరహాలో అనంతపురం క్రికెట్ పిచ్
మరో మూడ్రోజుల్లో దులీప్ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 5న మొదలయ్యే ఈ దేశవాళీ ట్రోఫీకి ఈసారి ప్రముఖ క్రికెటర్లు హాజరు కానున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి టాప్ స్టార్లు పాల్గొనకపోయినప్పటికీ, మిగతా ప్రధాన క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే నాలుగు జట్లను బీసీసీఐ ప్రకటించింది. మ్యాచ్‌లు అనంతపురం, బెంగళూరు మైదానాల్లో జరగనున్నాయి. అనంతపురం క్రికెట్ స్టేడియం, మౌలిక వసతుల పరంగా ఉత్తమ స్థాయిలో ఉందని, బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లను అందించడంలోనూ ముందుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఆర్డీటీ నిర్వహణలో ఉన్న క్రికెట్ స్టేడియం
ఈ స్టేడియం రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతోంది, అనంతపురం పిచ్ ఆస్ట్రేలియాలోని 'పెర్త్'ను పోలి ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2004 నుంచి 2013 వరకు ఇక్కడ జరిగిన 15 నాలుగు రోజుల మ్యాచుల్లో పేసర్లు 345 వికెట్లు తీయగా, స్పిన్నర్లు కేవలం 96 వికెట్లను మాత్రమే సాధించారు. ఈ పిచ్‌పై మంచి ప్రదర్శన చేస్తే, ఆసియా పర్యటనకు వెళ్లనున్న టీమ్ ఇండియా బ్యాటర్లు ఆసీస్‌లోనూ సత్తా చాటే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అనంతపురం స్టేడియంలో ఒక్కసారి మాత్రమే ఓ జట్టు 100 పరుగుల లోపు ఆలౌటైంది. 400కిపైగా పరుగులు కేవలం నాలుగుసార్లు మాత్రమే బ్యాటర్లు సాధించారు.
సెప్టెంబర్ 5న మ్యాచులు ప్రారంభం
బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరించే ఈ పిచ్‌పై దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ జరగనుండటంతో మ్యాచులు రసవత్తరంగా మారతాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 5న రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమ్ C, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమ్ Dతో తలపడనుంది. ఇరవై ఏళ్ల కిందట అనంతపురంలో క్రికెట్ మైదానం ఏర్పాటుచేశామని ఆర్డీటీ డైరెక్టర్ మాంచోఫెర్రర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని క్రీడా మైదానాలను అభివృద్ధి చేశాయని, రాబోయే దులీప్ ట్రోఫీ మ్యాచ్ కూడా ఈ పిచ్‌పై జరుగుతుండటం ఆనందకరమని వెల్లడించారు.