Page Loader
Andre Russell: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అండ్రి రస్సెల్‌..!
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అండ్రి రస్సెల్‌..!

Andre Russell: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అండ్రి రస్సెల్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు రస్సెల్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లుగా నిలవనున్నాయి. 37 ఏళ్ల రస్సెల్‌ ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం వెస్టిండీస్ జట్టులో ఎంపికయ్యాడు. జమైకాలోని సబీనా పార్క్‌లో జరిగే తొలి రెండు మ్యాచ్ల ద్వారా తన హోంగ్రౌండ్‌లోనే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నాడు. రస్సెల్‌ రిటైర్మెంట్‌ను వెస్టిండీస్ క్రికెట్ అధికారికంగా ధృవీకరించింది.

వివరాలు 

వెస్టిండీస్ తరఫున ఆడడం నాకు ఎంతో ఇష్టం

ఈ సందర్భంగా రస్సెల్‌ స్పందిస్తూ,''దీని అర్థాన్ని మాటల్లో వివరించడం అసాధ్యం. వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలోని గర్వకారణాలలో ఒకటి.చిన్నప్పుడు నేను ఈ స్థాయికి చేరుతానని ఊహించలేదు. కానీ ఆటను ప్రేమించడం,ఎక్కువగా ఆడటంతో నేను ఏ స్థాయిలో ఆడగలనో అర్థమైంది. మెరూన్ జెర్సీతో గుర్తింపు పొందాలని, ఇతరులకు ప్రేరణగా నిలవాలని ఆశిస్తూ నన్ను నేను మెరుగుపర్చుకున్నాను'' అని భావోద్వేగంతో చెప్పాడు. ''వెస్టిండీస్ తరఫున ఆడడం నాకు ఎంతో ఇష్టం.నా కుటుంబ సభ్యులు,స్నేహితుల సమక్షంలో స్వగృహంలో ఆడడం నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది.నా టాలెంట్‌ను చూపించే అవకాశంగా దీనిని భావిస్తున్నాను.కరేబియన్‌ నుంచి వచ్చే కొత్త క్రికెటర్లకు రోల్‌ మోడల్‌గా ఉండాలనుకుంటున్నాను.అందుకే నా అంతర్జాతీయ కెరీర్‌కు శిఖరంలోనే ముగింపు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను'' అని రస్సెల్‌ వివరించాడు.

వివరాలు 

2019 నుంచి టీ20 స్పెషలిస్ట్‌గా రస్సెల్‌ 

2019 నుంచి రస్సెల్‌ టీ20 స్పెషలిస్ట్‌గా కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ తరఫున ఇప్పటివరకు 84 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 22.00 సగటుతో 1,078 పరుగులు సాధించగా, స్ట్రైక్ రేట్‌ 163.08. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 71 పరుగులు. బౌలింగ్‌లో 30.59 సగటుతో 61 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 3/19. రస్సెల్‌ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం ద్వారా వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరిగే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు ఏడున్నర నెలల ముందు అతను జాతీయ జట్టుకు దూరమయ్యాడు.

వివరాలు 

రిటైర్మెంట్ ప్రకటించిన రెండో కీలక వెస్టిండీస్ ఆటగాడు రస్సెల్‌ 

ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రెండో కీలక వెస్టిండీస్ ఆటగాడిగా రస్సెల్‌ నిలిచాడు. అంతకుముందు నికోలస్ పూరన్‌ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రస్సెల్‌ కెరీర్‌ను గమనిస్తే.. అతను ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడాడు. వన్డేల్లో మాత్రం 56 మ్యాచ్‌లు ఆడి 27.21 సగటుతో 1,034 పరుగులు చేశాడు. నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 92 నాటౌట్‌. బౌలింగ్‌లో 31.84 సగటుతో 70 వికెట్లు పడగొట్టాడు. అతని బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ 4/35. రస్సెల్‌ 2012, 2016ల్లో టీ20 వరల్డ్‌కప్‌లు గెలిచిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాక రస్సెల్‌ పలు దేశీయ టీ20 లీగ్‌ల్లో కూడా కీలకపాత్ర పోషించాడు.

వివరాలు 

లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌ తరఫున రస్సెల్‌

మొత్తం 561 టీ20 మ్యాచ్‌ల్లో 26.39సగటుతో 9,316 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 121 నాటౌట్‌.బౌలింగ్‌లో 25.85సగటుతో 485వికెట్లు తీసాడు. ఉత్తమ గణాంకాలు 5/15.ఇటీవల యూఎస్‌ఏలోని మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (MLC)లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌ (LAKR)తరఫున రస్సెల్‌ ఆడాడు. ఆ లీగ్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి, ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 25.20 సగటుతో 126 పరుగులు చేశాడు. ఇందులో అతని బెస్ట్‌ స్కోరు 65 నాటౌట్‌. బౌలింగ్‌లో 32.90 సగటుతో 10 వికెట్లు తీసిన రస్సెల్‌ బెస్ట్‌ బౌలింగ్‌ గణాంకాలు 3/30. అయితే, అతను ఆడిన LAKR జట్టు ప్లేఆఫ్స్‌ చేరుకోలేకపోయింది.లీగ్‌ టేబుల్‌లో ఆ జట్టు చివరి స్థానంలో నిలిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వెస్టిండీస్ క్రికెట్ చేసిన ట్వీట్