ఆసియా క్రీడల్లో అథ్లెట్ లెజెండ్ పీటీ ఉష రికార్డులు తెలుసా
ఇండియన్ క్వీన్ ఆఫ్ ట్రాక్ అండ్ ఫీల్డ్"గా పీటీ ఉష పేరుగాంచారు. ఆమె క్రీడల్లో కొనసాగిన కాలంలో సంచలన క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. ఆసియా క్రీడలు నిర్వహించిన అథ్లెటిక్స్ విభాగంలో భారతదేశంలోనే మేటి క్రీడాకారిణిగా పీటీ ఉష నిలిచారు. ఆసియా క్రీడల్లో ఉష మొత్తంగా 11 పతకాలను కైవసం చేసుకుంది. వాటిలో నాలుగు స్వర్ణాలు కాగా ఏడు రజత పతకాలున్నాయి. 1986 ఆసియాడ్‌లో 4 బంగారు పతకాలు సాధించిన ఉష రికార్డులకెక్కారు. 1982లో 16 ఏళ్లకే దిల్లీలో రెండోసారి జరిగిన ఈవెంట్‌లో ఉష అరంగేట్రం చేసింది. ఈ మేరకు మహిళల 100 మీ, 200 మీ పరుగులో రజత పతకాలతో సరిపెట్టుకుంది.
1986 ఆసియా క్రీడల్లో ఉష రికార్డుల మోత
1983లో ఉష అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. 1984లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో నాల్గో స్థానం సంపాదించింది. ఈ మేరకు 1985లో భారత ప్రభుత్వం పద్మ శ్రీ బిరుదుతో సన్మానం చేసింది. 1986లో సియోల్, దక్షిణ కొరియా రాజధానిలో జరిగిన ఆసియా క్రీడల్లో ఉష, బంగారు పతకాల పంట పండించింది. 400 మీటర్ల హర్డిల్స్‌లో ఓ పతకం, 400, 200 మీటర్ల పరుగులో రెండు, 400 మీటర్ల రిలే రేస్‌లో మరొకటి, ఇలా నాలుగు బంగారు పతకాలను ఒడిసిపట్టింది. 100 మీటర్ల పరుగులో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ కు వచ్చిన మొత్తం ఐదు బంగారు పతకాల్లో నాలుగు ఉషవే కావడం గమనార్హం.
రిటైర్ అయ్యే సమయానికి 103 పతకాలతో సగర్వంగా నిలిచిన ఉష
1989 దిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో 4 స్వర్ణ, 2 రజత పతకాలు సాధించింది. 1990లో బీజింగ్ ఆసియా క్రీడల్లో 3 రజత పతకాలను గెలుచుకుంది. 1994లోనూ హీరోషిమా ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని సాధించింది. మరోవైపు 1997లో పరుగు పందేల నుంచి ఉష రిటైర్ అయ్యే సమయానికే ఆమె వద్ద 103 అంతర్జాతీయ పతకాలు ఉండటం విశేషంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్ వెళ్లాలనుకునే భారత అథ్లెట్‌లకి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీని మొదలుపెట్టారు. ఇండియన్ రన్నింగ్ క్వీన్ గా పేరు గాంచిన ఉష, తోటి క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన ఉష, ఎందరో క్రీడాకారుల బంగారు భవితకు బాటలు వేశారు.