Page Loader
Olympic Games-BCCI: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు అండగా  కేంద్ర క్రీడా శాఖ.. బీసీసీఐ,కార్పొరేట్‌ సంస్థల మద్దతు 
ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు అండగా బీసీసీఐ,కార్పొరేట్‌ సంస్థల మద్దతు

Olympic Games-BCCI: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు అండగా  కేంద్ర క్రీడా శాఖ.. బీసీసీఐ,కార్పొరేట్‌ సంస్థల మద్దతు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనబోయే భారత అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణ,సౌకర్యాలను అందించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రతి ఒలింపిక్ క్రీడకూ ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో ఇటీవల ఒక కీలక సమావేశం జరిగింది. ఈసమావేశంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా,58 కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో భాగంగా బీసీసీఐ 2 లేదా 3 ఒలింపిక్ క్రీడలను దత్తత తీసుకుని, ఆ క్రీడలలో అథ్లెట్లను శిక్షణ ఇచ్చేందుకు సహకరించేందుకు అంగీకరించింది. అలాగే, ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా ఇదే మార్గంలో ముందుకు రావాలని ప్రతిపాదించాయి.

వివరాలు 

ప్రతి క్రీడకూ ప్రత్యేక శిక్షణా కేంద్రం 

ఈ సందర్భంగా క్రీడా మంత్రిత్వ శాఖ ఒక అధికారి మాట్లాడుతూ,"ప్రతి క్రీడకు ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే మా ఉద్దేశం.ప్రతి కేంద్రంలో 100 నుంచి 200 మంది అథ్లెట్లను ఎంపిక చేసి,వారి లక్ష్యం ఒలింపిక్స్ అయేలా శిక్షణ ఇస్తాం"అని తెలిపారు. కార్పొరేట్ సంస్థలు ఈ ఆలోచనకు మద్దతు తెలిపినట్టు ఆయన వెల్లడించారు.ప్రస్తుతం భారత క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 23 జాతీయ శిక్షణా కేంద్రాలు ఉన్నప్పటికీ, వాటిలో ప్రత్యేకంగా ఒక్కో క్రీడకోసం ఉన్నవి కేవలం మూడు మాత్రమే. ఢిల్లీలో ఈత, షూటింగ్‌ శిక్షణ కేంద్రాలు, రోహ్తక్‌లో బాక్సింగ్ కేంద్రం మాత్రమే ఈ కోవలోకి వస్తాయి. ఇకపై ప్రతి క్రీడకూ ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నది క్రీడా శాఖ తలపోస్తోంది.

వివరాలు 

ప్రపంచస్థాయి శిక్షణా కేంద్రాల ఏర్పాటు

క్రికెట్‌ లోనే అత్యంత ధనికమైన బోర్డు అయిన బీసీసీఐ ఇప్పటికే ఒలింపిక్స్‌ క్రీడల అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందించిన అనుభవం ఉంది. 2008లో జాతీయ క్రీడల అభివృద్ధి నిధికి రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చింది. అలాగే పారిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని భారత ఒలింపిక్ సంఘానికి రూ.8.5 కోట్లు సాయం చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు ప్రైజ్‌మనీని కూడా అందించింది. ఇప్పుడు అయితే మరింత మద్దతుగా, ప్రపంచస్థాయి శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావడం గమనార్హం.

వివరాలు 

ఒలింపిక్స్‌కు వెస్టిండీస్‌ ఎలా ? 

క్రికెట్ 128 ఏళ్ల విరామం తర్వాత 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో తిరిగి ప్రవేశించబోతున్న నేపథ్యంలో, వెస్టిండీస్ బోర్డు తమ జట్టును కూడా ఆ క్రీడల్లో భాగంగా చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేసింది. అయితే వారికో చిక్కొచ్చి పడింది. వాస్తవానికి వెస్టిండీస్ క్రికెట్ జట్టు అనేది 15 దేశాల సమ్మేళనంగా ఉండటంతో, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో ప్రత్యెక జట్టుగా బరిలోకి దిగే అవకాశం లేదు. పైగా, ఈ ప్రాంతంలోని 12 దేశాలకు తమ తమ జాతీయ ఒలింపిక్ కమిటీలు ఇప్పటికే ఉన్నాయి. అందువల్ల వీరికి ఒలింపిక్స్‌లో ప్రత్యక్ష ఎంట్రీ లభించదు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ బోర్డు ఐసీసీకి లేఖ రాస్తూ రెండు ప్రతిపాదనలు చేశాయి.

వివరాలు 

ఒలింపిక్స్‌కు వెస్టిండీస్‌ ఎలా ? 

మొదటిది.. అంతర్జాతీయ ర్యాంకింగ్స్ ఆధారంగా వెస్టిండీస్ అర్హత సాధిస్తే, కరీబియన్ దేశాల మధ్య లోకల్ టోర్నమెంట్ నిర్వహించి, గెలిచిన దేశం తరఫున ఆ జట్టు బరిలోకి దిగాలని సూచించింది. రెండవది.. ఐసీసీ అసోసియేట్ దేశాలతో కలిసి క్వాలిఫయింగ్ టోర్నీ నిర్వహించి, కరీబియన్ జట్లను అందులో పాల్గొనడానికి అనుమతించాలన్నది. ఈ మేరకు వెస్టిండీస్ బోర్డు సీఈఓ క్రిస్ డెరింగ్ మాట్లాడుతూ, "ఒలింపిక్స్‌లో పాల్గొనడం అనేది ఒక అరుదైన అవకాశమైందిగా భావిస్తున్నాం. మా దేశాలకి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఒక స్పష్టమైన మార్గం కావాలి" అని తెలిపారు.