ఎన్‌సీఏలో బుమ్రా ప్రాక్టీస్.. జూలైలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్న యార్కర్ల కింగ్
ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అంతకంటే ముందే ఆసియా కప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రాపైనే నిలిచాయి. వెన్నుముక గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా త్వరలో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న బుమ్రా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోజుకు ఏడు ఓవర్లు బౌలింగ్ చేస్తూ ఫిట్‌నెస్ మెరుగుపరచుకుంటున్నాడు. అదే విధంగా ఈ యార్కర్ల కింగ్ జులైలో ప్రాక్టీస్ మ్యాచులు ఆడే అవకాశం ఉందని ఎన్‌సీఏ ప్రతినిధులు పేర్కొన్నారు. బీసీసీఐ ఇప్పటికే బుమ్రా కోసం ఐర్లాండ్ తో టీ20 సిరీస్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
బుమ్రా రీఎంట్రీ పట్ల జాగ్రత్త వహించాలి
బుమ్రా రీఎంట్రీ పట్ల జాగ్రత్త వహించాలని, తొందరపాటు పనికిరాదని టీమిండియా మాజీ స్ట్రెంట్, కండిషనల్ కోచ్ రామ్‌జీ శ్రీనివాసన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మ్యాచ్ ఆడే ముందు దేశవాళీ మ్యాచుల్లో ఆడించాలన్నారు. టీ20 బౌలర్‌గా జట్టులోకి అడుగుపెట్టిన బుమ్రా అతనికాలంలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. వన్డే, టెస్టుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. గతేడాది గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్, బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలకు అతను దూరమయ్యాడు. అయితే వన్డే వరల్డ్ కప్ లోపు బుమ్రా కోలుకోని, భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అదే విధంగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా ఎన్‌సీఏలోనే కోలుకుంటున్నారు.